IMD Rain alerts : ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు, దిల్లీలో వర్షాలపై ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది.
ఆగస్టు మొదటి వారం నుంచి ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 12 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఆగస్టు 12 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 10న జమ్మకశ్మీర్, హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆగస్టు 12 వరకు ఆరెంజ్ అలర్ట్, ఆగస్టు 15 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మండి, బిలాస్ పూర్, సోలన్, సిర్మౌర్, శిమ్లా, కులు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, బలమైన గాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, తోటలు, పంటలు, బలహీనమైన నిర్మాణాలు, కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
అంతకుముందు, ఆగస్టు 7 న, ఐఎండీ రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన వర్షపాతాన్ని నివేదించింది. మండి జిల్లాలోని జోగిందర్ నగర్లో 24 గంటల్లో అత్యధికంగా 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. రోజువార జీవితంపై ప్రభావం పడటంతో స్థానికులు, సందర్శకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 1న సంభవించిన మేఘ విస్ఫోటనం, ఆకస్మిక వరదలు కులు, మండీ, శిమ్లా జిల్లాలను ప్రభావితం చేశాయి.
దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీలో ఆగస్టు 11 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. శనివారం దిల్లీ ఎన్సీఆర్లో ఆకాశం మేఘావృతమై, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శుక్రవారం దిల్లీ, ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి సాయంత్రం భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. నగరాన్ని 'గ్రీన్' జోన్లో ఉంచిన వాతావరణ శాఖ సిద్ధంగా ఉండాలని 'ఆరెంజ్' హెచ్చరిక జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలో ఇవాళ(ఆగస్టు 10) పార్వతీపురం మన్యం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం