మార్చ్ నెలలో ఓవైపు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుంటే, మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మాత్రం అనేక రాష్ట్రాలకు చల్లటి వార్తను అందించింది. వచ్చే వారం వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇందుకు ఒక కారణం అని పేర్కొంది.
పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ నెల 20న మొదలైన వర్షాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
మార్చ్ 21న పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, 22 వరకు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడతాయని ఐఎండీ తెలిపింది.
మార్చ్ 20-22 మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
మార్చ్ 20 నుంచి 22 వరకు ఉప హిమాలయ రాష్ట్రాలైన పశ్చిమ్ బెంగాల్, సిక్కిం, బిహార్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
శనివారం ఐపీఎల్18 ప్రారంభంకానున్న నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్లో వర్ష సూచన.. క్రికెట్ లవర్స్‌ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఈశాన్య అసోం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో మార్చ్ 20 నుంచి 23 వరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మార్చ్ 21, 22 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు లేదా హిమపాతం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
రానున్న 5 రోజుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మార్చ్ 21న దక్షిణ అసోంలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
22 నుంచి 24 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తా కర్ణాటక, ఉత్తర అంతర్గత కర్ణాటక, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-50 కి.మీ) చెదురుమదురు తేలికపాటి/ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
రానున్న 5 రోజుల పాటు కేరళ, మాహే, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మార్చ్ 21, 22 తేదీల్లో తెలంగాణలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.