రానున్న వారం రోజుల పాటు భారత్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మే 24 వరకు దేశంలోని కోస్తా, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన అడ్వైజరీలో పేర్కొంది.
ఐఎండీ ప్రకారం.. కర్ణాటక, కొంకణ్, గోవా, కేరళ సహా పశ్చిమ తీరం, ద్వీపకల్ప భారతంలోని పరిసర ప్రాంతాల్లో మే 18 నుంచి మే 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్థానికంగా వరద పరిస్థితి ఏర్పడవచ్చు.
రాబోయే 5-6 రోజుల్లో ఈశాన్య భారతదేశం, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో చెట్లు కూలవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
మే 18 నుంచి 20 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 18 నుంచి 24 వరకు కేరళ, మాహే, కోస్తా కర్ణాటక, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక; మే 20 నుంచి 22 వరకు కోస్తాంధ్ర, యానాం; మే 18 నుంచి 20 వరకు రాయలసీమ, మే 18-21 వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో వానలు పడతాయి.
దీనికితోడు మే 20 నుంచి 22 వరకు కోస్తా కర్ణాటక, మే 18-20 వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, మే 19-22 వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 20న కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 20-23 మధ్య కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర. మరాఠ్వాడాలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
మే 20 వరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో, 24 వరకు అసోం, మేఘాలయలో వర్షాలు పడతాయి.
ఇక మే 19, 20 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.
జమ్ముకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాక తెలిపింది.
ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు మే 22 వరకు తీవ్రమైన వడగాలులు (హీట్‌వేవ్) వంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
సంబంధిత కథనం