Railways: అటవీ భూముల్లో రైల్వే ప్రాజెక్టులపై పర్యావరణ శాఖ కీలక ఆదేశాలు..
Railways: అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు రైల్వే విభాగం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అటవీ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ ల ఏర్పాటు సహా ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి రైల్వే విభాగం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం పర్యావరణ శాఖ వివరణ ఇచ్చింది. అయితే, ఆ అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే (Railway) కు చెందిన భూములై ఉండాలని స్పష్టం చేసింది.
Railway projects:అనుమతులు అక్కర్లేదు
అటవీ ప్రాంతాల్లోని రైల్వే శాఖ కు చెందిన భూముల్లో రైల్వే శాఖ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని పర్యావరణ శాఖ వివరించింది. గత సంవత్సరం మార్చి నెలలో జారీచేసిన సంబంధిత ఆదేశాల వల్ల పలు రాష్ట్రాల్లో నెలకొన్న గందరగోళంపై ఈ వివరణ ద్వారా స్పష్టతనిచ్చింది. అటవీ ప్రాంతాల్లో రైల్వేకు సొంతమైన భూముల్లో రైల్వే విభాగం అభివృద్ధి పనులకు అటవీ పరిరక్షణ చట్టం (Forest (Conservation) Act) వర్తించదని గత సంవత్సరం ఇచ్చిన ఆదేశాల్లో కేంద్ర పర్యావరణ శాఖ పేర్కొంది. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ఆర్ఓడబ్ల్యూ (RoW) అనే పదంపై గందరగోళం నెలకొనడంతో తాజాగా, దానిపై స్పష్టతనిచ్చింది. అటవీ ప్రాంతాల్లోని రైల్వే (Railway) భూముల్లో రైల్వే విభాగం అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అక్కర లేదని తాజాగా తేల్చి చెప్పింది. ఆర్ఓడబ్ల్యూ (RoW) అనగా రైల్వే ఓన్డ్ (railway owned) అని వివరించింది. పర్యావరణ శాఖ ఇచ్చిన తాజా ఆదేశాలతో, సున్నితమైన అటవీ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించడానికి రైల్వే శాఖకు మార్గం సుగమమైంది.
RoW means: రైట్ ఆఫ్ వే కాదు.. రైల్వే ఓన్డ్..
ఆర్ఓడబ్ల్యూ (RoW) అనాగా రైట్ ఆఫ్ వే(right of way) నా? లేక, రైల్వే ఓన్డ్ (railway owned) నా? అనే విషయంలో స్పష్టత లోపించడంతో, దీనిపై వివరణ ఇవ్వాలని పలు రాష్ట్రాలు పర్యావరణ శాఖకు లేఖలు రాశాయి. దాంతో, ఆ విషయంపై పరిశీలన జరిపిన పర్యావరణ శాఖ తాజా వివరణను జారీ చేసింది. ‘‘ఆర్ఓడబ్ల్యూ (RoW) అనగా.. రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న అటవీ ప్రాంతం. ఇక్కడ రైల్వే పనులు, నిర్వహణ కు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు’ అని వివరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అటవీ విభాగ ప్రిన్స్ పల్ సెక్రటరీలకు లేఖ రాసింది.