Viral Video: రూ.500 నోటు స్థానంలో రూ.20.. రైల్వే ఉద్యోగి దగా.. చివరికి..-railway employee replaces passenger rs 500 note with rs 20 viral video ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Railway Employee Replaces Passenger Rs 500 Note With Rs 20 Viral Video

Viral Video: రూ.500 నోటు స్థానంలో రూ.20.. రైల్వే ఉద్యోగి దగా.. చివరికి..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 27, 2022 06:35 PM IST

Railway Employee cheating - Viral Video: ప్రయాణికుడి కళ్లుగప్పి ఓ రైల్వే ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు. టికెట్ కౌంటర్లోనే క్షణాల్లో దగా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Viral Video: రూ.500 నోటు స్థానంలో రూ.20.. రైల్వే ఉద్యోగి దగా.. చివరికి..
Viral Video: రూ.500 నోటు స్థానంలో రూ.20.. రైల్వే ఉద్యోగి దగా.. చివరికి..

Railway Employee cheating - Viral Video: ప్రయాణికుడిని ఓ రైల్వే ఉద్యోగి మోసం చేశాడు. టికెట్ కౌంటర్‌లో కుటిల బుద్ధిని ప్రదర్శించాడు. బురిడీ కొట్టించి ప్యాసింజర్ డబ్బును కాజేశాడు. ప్రయాణికుడు ఇచ్చిన రూ.500 నోటును ఎంచక్కా కాజేసి, రూ.20నోటును ఆ స్థానంలో చూపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‍గా మారింది. సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లటంతో ఆ ఉద్యోగిపై చర్యలను ప్రారంభించారు. అసలు ఈ ఘటన ఎక్కడ.. ఎలా జరిగిందో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‍లో ఈ మోసం జరిగింది. టికెట్ కౌంటర్‌లోని ఉద్యోగి దీనికి పాల్పడగా.. ప్రయాణికుడి వెనుక ఉన్న ఓ వ్యక్తి దీన్ని కెమెరాలో బంధించాడు. రూ.125 టికెట్ కోసం ఓ ప్రయాణికుడు రూ.500 నోటు ఇవ్వగా.. ఆ ఉద్యోగి రెప్పపాటులో దాన్ని జేబులో పెట్టుకొని రూ.20ను నోటును ఆ చేతిలో పట్టుకున్నారు. టికెట్ ధర రూ.125 అని.. ఇంకా డబ్బు ఇవ్వాలని ఆ ప్రయాణికుడిని డిమాండ్ చేసినట్టు వీడియోలో తెలుస్తోంది.

ఇదీ జరిగింది

Railway Employee cheating - Viral Video: సూపర్ ఫాస్ట్ గ్వాలియర్ రైలులో ప్రయాణించేందుకు టికెట్ ఇవ్వాలంటూ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‍లో టికెట్ కౌంటర్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. రూ.500 నోటును కౌంటర్‌లో ఉన్న రైల్వే ఉద్యోగికి ఇచ్చాడు. అయితే ఆ ప్రయాణికుడు చూడకుండా రూ.500 నోటును జేబులో వేసుకొని.. ఆ స్థానంలో రూ.20నోటును బయటికి తీశాడు ఆ ఉద్యోగి. ఆ ప్రయాణికుడు రూ.20 నోటు ఇచ్చాడనేలా ప్రవర్తించాడు. టికెట్ ధర రూ.125 అని, మిగిలిన డబ్బు ఇవ్వాలని ప్రయాణికుడికి చెప్పాడు. ఈ తతంగమంతా వీడియోలో రికార్డ్ అయింది.

రైల్ విస్పర్స్ (RAILWHISPERS) అనే ట్విట్టర్ హ్యాండిల్‍లో ఈ వీడియో పోస్ట్ అయింది. రైల్వే మంత్రి, వివిధ రైల్వే శాఖలు, అధికారులకు కూడా ఆ యూజర్ ట్యాగ్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

చర్యలు తీసుకుంటున్నాం

ఈ రైల్వే ఉద్యోగి మోసం ఉన్నతాధికారుల వరకు చేరింది. ఆ ఎంప్లాయిపై అవసరమైన చర్యలను సంబంధిత అధికారులు ప్రారంభించారని రైల్వే సేవ తెలియజేసింది. ఆ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ డివిజన్, నార్తెర్న్ రైల్వే ట్విట్టర్ లో రిప్లే ద్వారా తెలియజేసింది.

కాగా, ఈ వీడియోపై ట్విట్టర్ లో చాలా యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందు తాము కూడా ఇలాంటివి ఎదుర్కొన్నట్టు తెలిపారు. చెన్నైలో తనకు చాలా సార్లు ఇలా జరిగిందంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. మోసం చేసిన ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని చాలా మంది డిమాండ్లు చేస్తున్నారు.

IPL_Entry_Point