Rahul Gandhi Speech : లోక్‌సభలో బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్.. ప్రధాని మోదీ అభ్యంతరం
Rahul Gandhi Speech In Lok Sabha : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే రాహుల్ మాటలపై ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దేవ దూతగా మోదీ వచ్చారనే అంశాన్ని కూడా రాహుల్ లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మతం అనే పేరుతో భయం, ద్వేషం, అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా సభలో కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు రాహుల్. దీంతో అధికార ఎన్డీయే అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ ఓంబిర్లా కూడా సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శన చేయకూడని, నిబంధనలు అంగీకరించవని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ప్రధాని మోదీ కలగజేసుకుని.. రాహుల్ వ్యాఖ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మతంపై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్ష నేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి అహింస గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.
తాను మాత్రం బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే హిందూ సమాజం కాదని వ్యాఖ్యానించారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అహింస సందేశాలను చాటి చెబుతున్నాయన్నారు.
'దేశమంతా ఏకమైన రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసింది. భారత్ అనే భావన, రాజ్యాంగంతోపాటు బీజేపీ ఆలోచనలు ప్రతిఘటించిన లక్షలాది మందిపై పదేళ్లలో దాడి జరిగింది. నేను కూడా బాధితుడినే. నాపై 20కిపైగా కేసులు మోపారు. రెండేళ్ల జైలు శిక్ష పడింది. నా ఇల్లు తీసుకున్నారు. ఈడీ 55 గంటల విచారణ చేసింది. ప్రతిపత్రక్షంలో ఉండటం గర్వంగా ఉంది. సంతోషంగా ఉంది, అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైనది. ఇందలోనే సత్యం ఉంది. ' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ అగ్నివీర్‌ల ప్రస్తావన లేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నీట్ పరీక్షలను కమర్షియల్ గా మార్చారని విమర్శించారు. గతంలో తెచ్చిన రైతు చట్టాలతో అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయని, దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడుతానని మోదీ చెప్పారని రాహుల్ గుర్తు చేశారు.
'జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసింది. అల్లర్లతో మణిపుర్ అట్టుడికినా ప్రధాని వెళ్లలేదు. అక్కడ నా కళ్లముందే పిల్లలపై బుల్లెట్లు వర్షం కురిసింది. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయింది. జీఎస్టీతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటితో దేశ ప్రజలకు కలిగిన లాభం ఏంటి' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.