Rahul Gandhi : ఆమె ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు.. స్టాక్ మార్కెట్లపై రాహుల్ గాంధీ ఆందోళన
Rahul Gandhi Hindenburg Report : సెబీ చీఫ్ మాధవి పురి బచ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇంకా ఆమె ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ చీఫ్ మధవి పురి బచ్‌తోపాటుగా ఆమె భర్తపై ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌తో వారికి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ స్పందించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో హిండెన్‌బర్గ్ తాజా నివేదిక చెబుతుందున్నారు.
చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెబీ సమగ్రత, ఛైర పర్సన్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా రాజీ పడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సెబీ ఛైర్ పర్సన్ ఎందుకు రాజీనామా చేయాలేదో అనే విషయాన్ని దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. ఆమెపై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతిందన్నారు.
దేశంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలు అడుగుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. సెబీ ఛైర్ పర్సన్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన డబ్బు కోల్పోతే ఎవరు వారికి జవాబుదారీ? ప్రధాని మోదీనా? సెబీ ఛైర్ పర్సనా? అదానీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కోర్టు సుమోటాగా పరిశీలిస్తుందా? అని అడిగారు.
మరోవైపు హిండెన్‌బర్గ్ ఆరోపణలను మాధవి ఖండించారు. తమ ఆర్థిక రికార్డులు తెరిచిన పుస్తకమని చెప్పారు. అదానీ గ్రుపు కూడా ఈ ఆరోపణలు కొట్టేసింది.
ఈ వివాదం నేపథ్యంలో ట్రేడింగ్‌లో కొంత బలహీనతను తోసిపుచ్చలేమని కొందరు నిపుణులు అంటున్నారు. మదుపరులు, ట్రేడర్లు అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కనీసం సోమవారం ట్రేడింగ్ ప్రారంభ దశల్లో కొంత బలహీనత ఉండవచ్చని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా చెప్పారు. ఆ తర్వాత మద్దతుగా మార్కెట్లోకి కొత్త కొనుగోళ్లు తక్కువ స్థాయిలో వస్తాయో లేదో గమనించాలన్నారు. సోమవారం మార్కెట్లు చిన్న జెర్క్ తర్వాత స్థిరపడవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.