Rahul Gandhi: రాహుల్ గాంధీ రైల్వే కూలీ అవతారం; లగేజ్ మోసిన కాంగ్రెస్ నేత
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువారం కొత్త అవతారంలో కనిపించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిన రాహుల్ గాంధీ అక్కడి రైల్వే పోర్టర్లతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కూలీలు ధరించే షర్ట్ ను, బాడ్జిని రాహుల్ గాంధీ కూడా ధరించారు.
Rahul Gandhi dons 'Coolie' attire: ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఐ ఎస్ బి టి రైల్వే స్టేషన్ కు గురువారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు. అక్కడి రైల్వే కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను, పరి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
లగేజ్ మోసిన రాహుల్ గాంధీ
ఈ సందర్భంగా రైల్వే కూలీలు ధరించే షర్ట్ ను రాహుల్ గాంధీ కూడా ధరించారు. వారు చేతిపై ధరించే బ్యాడ్జి కూడా కట్టుకున్నారు. అంతేకాదు రైల్వే కూలి తరహాలో లగేజ్ కూడా మోశారు. రాహుల్ గాంధీకి ఆనంద్ విహార్ ఐ ఎస్ బి టి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలీలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ఆయన చుట్టూ చేరి కూర్చున్నారు. ఆయనతో కబుర్లు చెప్పారు. తమ సమస్యలను విన్నవించారు. రాహుల్ గాంధీ కూడా ఎలాంటి బేషజాలు లేకుండా వారి మధ్యనే కూర్చున్నారు. వారితో మమేకమై వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. రాహుల్ గాంధీ తీరును ప్రజలు నెటిజనులు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు.
కాంగ్రెస్ ట్వీట్
రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆనంద విహార్ ఐఎస్బిటి రైల్వే స్టేషన్ కు వెళ్లిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో వెల్లడించింది. ‘‘ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ గురువారం ఆనంద విహార్ రైల్వే స్టేషన్లో తన రైల్వే పోర్టర్ స్నేహితులను కలిశారు. ఆ వీడియో వైరల్ అయింది. రైల్వే కూలీ మిత్రులు రాహుల్ గాంధీ రాకతో ఎంతో సంతోషించారు’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పోర్టర్ డ్రెస్ లో ఉన్న రాహుల్ గాంధీ ఫోటోలను కూడా షేర్ చేసింది. భారత్ జోడో యాత్ర కంటిన్యూ అవుతుంది అంటూ ఒక కామెంట్ ను కూడా జత చేసింది. రాహుల్ గాంధీ కూడా తన పోర్టర్ మిత్రులతో కలిసిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. ‘‘ఈ రోజు నా రైల్వే కూలి సోదరులను ఆనంద విహార్ టెర్మినల్లో కలుసుకున్నాను. రైల్వే కూలీలను కలవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. వాళ్ళు కూడా చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించారు. వారి ఆశలు నెరవేరాలని అందుకు సాధ్యమైనంతగా నేను కృషి చేయాలని కోరుకుంటున్నాను’’ అని రాహుల్ గాంధీ తన ఇన్ స్టా పోస్ట్ లో పేర్కొన్నారు.
వివిధ వర్గాల ప్రజలతో..
భారత్ జోడో యాత్ర తరువాత కూడా రాహుల్ గాంధీ దేశంలోని వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. వారిని కలుస్తున్నారు. వారి సమస్యలను వింటున్నారు. వారితో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లేదారిలో ఒక పొలంలో రైతు కూలీలను కలిశారు. వారితో కలిసి భోజనం చేశారు. వారిని న్యూఢిల్లీలోని తమ నివాసానికి ఆహ్వానించి మంచి విందు భోజనం అందించారు. అంతకుముందు, ట్రక్ డ్రైవర్లతో కూడా రాహుల్ గాంధీ కలిసి ప్రయాణించారు. వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు.