్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. పహల్గామ్, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై దేశ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. పార్లమెంటులో చర్చించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మొత్తం ప్రతిపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు.
'పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని మొత్తం ప్రతిపక్షాల తరఫున మిమ్మల్ని కోరుతున్నాను. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాల్పుల విరమణను మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దానిపై కూడా చర్చించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాల్సిన సమయం కూడా ఇది. మీరు నా డిమాండ్‌ను గమనించి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను.' అని రాహుల్ గాంధీ లేఖలో రాశారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరుతూ ఏప్రిల్ 28న రాసిన లేఖను గుర్తు చేశారు. అమెరికా, భారతదేశం నుండి వచ్చిన కాల్పుల విరమణ ప్రకటనలతో ఈ సమావేశం మరింత అవసరమని పేర్కొన్నారు.
ఆదివారం నాడు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఉంటారని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు రాజకీయ పార్టీలు హాజరు కావద్దని కోరారు.