Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. తొలిసారి ఈ స్థానానికి ఎంపిక-rahul gandhi appointed leader of opposition in lok sabha congress announced ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. తొలిసారి ఈ స్థానానికి ఎంపిక

Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. తొలిసారి ఈ స్థానానికి ఎంపిక

Chatakonda Krishna Prakash HT Telugu
Updated Jun 26, 2024 06:34 AM IST

Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నియమితులయ్యారు. కాంగ్రెస్, మిత్రపక్షాల సమావేశంలో ఈ నిర్ణయం ఖరారైంది.

Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. తొలిసారి ఈ పదవికి ఎంపిక
Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. తొలిసారి ఈ పదవికి ఎంపిక (PTI)

Rahul Gandhi: లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ప్రతిపక్షాల నాయకులతో సమావేశం తర్వాత నేడు (జూన్ 25) ఈ విషయాన్ని వెల్లడించారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలిసారి లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ నియమితులయ్యారు.

“ప్రొటెం స్పీకర్ భర్తృహరికి సీపీపీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ లేఖరాశారు. లోక్‍సభలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నియమించిన విషయంపై సమాచారం ఇచ్చారు” అని మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్ చెప్పారు. దీంతో 18వ లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు రాహుల్ గాంధీ.

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల ఎంపీల సమావేశం జరిగింది. రాహుల్ గాంధీని లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా నియమిస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు నాయకులు. ఎన్‍సీపీ (ఎస్‍పీ) నేత సుప్రియా సూలే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, రాష్ట్రీయ లోక్‍తాంత్రిక్ పార్టీ నాయకుడు హమునన్ బెనివాల్ సహా మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

“ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. లోక్‍సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో రాహుల్ గాంధీ కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఎంపికవడం మాకు సంతోషంగా ఉంది” అని శివసేన (యూబీటీ) నాయకుడు ఆనంద్ దూబే అన్నారు.

ప్రమాణం చేసిన రాహుల్

రాహుల్ గాంధీ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం లోక్‍సభలో రాయ్ బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. మంగళవారమే (జూన్ 25) ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

పదేళ్ల తర్వాత..

పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ లోక్‍సభలో మళ్లీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. లోక్‍సభలో ప్రతిపక్ష నేత స్థానాన్ని సంపాదించింది. ఈ ఏడాది లోక్‍సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. 2014 తర్వాత లోక్‍సభలో 10 శాతం (54 సీట్లు) కంటే ఎక్కువ సీట్ల మార్కును దాటింది. దీంతో దశాబ్దం తర్వాత బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.

లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కీలకమైన ప్యానెళ్లలో ఉంటారు. ఎన్నికల కమిషనర్లు, సీబీఐ డైరెక్టర్లను ఎంపిక చేసే కమిటీల్లో ప్రధాన మంత్రితో పాటు ప్రతిపక్షనేత కూడా ఉంటారు.

లోక్‍సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు రోజుల తర్వాత జూన్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. లోక్‍సభలో ప్రతిపక్ష నేత పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ఆ సమావేశంలో ఆ పార్టీ తీర్మానం చేసింది. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర కారణంగానే పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని ప్రశంసించిది. కాగా, తాను ప్రతిపక్ష నేత స్థానాన్ని చేపట్టేందుకు సిద్ధమేనని గత వారంలోనే రాహుల్ సంకేతాలు ఇచ్చారు. ఆ పదవి చేపట్టాల్సిందేనని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఖర్గే తనను బెదిరించారని అన్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.