Crime news : భార్యతో బయటకు వెళ్లాలని చెప్పినా బైక్ తాళాలు ఇవ్వలేదని- తల్లిని కిరాతకంగా చంపి..
UP Crime news : యూపీలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను బయటకు తీసుకెళ్లాలని, బైక్ తాళాలు ఇవ్వమని ఓ వ్యక్తి తన తల్లిని అడిగాడు. కానీ ఆమె కీ ఇవ్వలేదు. చివరికి కోపంలో సొంత తల్లిని చంపేశాడు ఆ వ్యక్తి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను బయటకు తీసుకెళ్లాలని ఓ వ్యక్తి ప్లాన్ చేశాడు. బైక్ తాళాలు ఇవ్వమని తల్లిని అడిగాడు. కానీ ఆమె ఇవ్వలేదు! కోపంతో సొంత తల్లిని కిరాతకంగా చంపేశాడు ఆ వ్యక్తి.
ఇదీ జరిగింది..
యూపీ రాయ్ బరేలీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన 65 ఏళ్ల తల్లి గొంతు నులిమి చంపి ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి, ఇంటికి 40 కిలోమీటర్ల దూరంలోని కాలువలో పడేశాడు.
నిందితుడు రాకేష్ పాల్ (26) నిరుద్యోగి అని, తల్లిదండ్రులతో రిలేషన్ సరిగ్గా లేదని, కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఉన్నప్పటికీ అదే గ్రామానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడని సమాచారం. అతనిపై బీఎన్ఎస్ సెక్షన్ 103(2) కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు రాయ్‌బరేలీ ఏఎస్పీ ఎస్కే సిన్హా తెలిపారు.
“రామ్ దులారే భార్య కళావతి నవంబర్ 15 నుంచి కనిపించకుండా పోయింది. నిందితుడి సూచన మేరకు సలోన్ పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు,” అని ఎస్పీ (రాయ్ బరేలీ) యశ్ వీర్ సింగ్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి (నవంబర్ 15) రోజున రామ్ దులారే గంగానదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. నిందితుడు రాకేష్ పాల్, అతని భార్య, తల్లి కళావతి ఇంట్లో ఉన్నారు. ఉదయం 8 గంటల సమయంలో తండ్రి వెళ్లిపోయిన తర్వాత భార్యను గంగానది వద్దకు తీసుకెళ్తానని చెప్పి బైక్ తాళాలు కావాలని తల్లిని అడిగాడు. తాళాలు ఇవ్వడానికి కళావతి నిరాకరించింది. కోపంతో ఊగిపోయిన కుమారుడు, సొంత తల్లి అని కూడా చూడకుండా, కళావతిని చంపి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇంటి పక్కనే ఉన్న గదిలో ఉంచాడు.
ఆ తర్వాత, రాకేష్ తన భార్యతో కలిసి గంగానది వద్దకు వెళ్లాడు. చీకటి పడిన తర్వాత, ఇంటికి వెళ్లి తల్లి శవాన్ని బైక్‌పై ఎక్కించుకుని 40 కిలోమీటర్ల దూరంలోని శారదా కాలువలో పడేశాడు.
నవంబర్ 16న ఇంటికి వచ్చిన రామ్ దులారే తన భార్య కనిపించకపోవడంతో సలోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుమారుడిని విచారిస్తున్న సమయంలో నిఘా రికార్డులు, అతను చెబుతున్న కథలకు మధ్య చాలా వ్యత్యాసాలు కనిపించాయి. ఫలితంగా అతని మీద పోలీసులకు అనుమానాలు పెరిగాయి. సుదీర్ఘంగా విచారించిన అనంతరం నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మృతదేహం ఎక్కడ ఉందో చెప్పాడు. ఘటన జరిగిన 15 రోజుల తర్వాత, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారని అదనపు ఎస్పీ తెలిపారు.
సంబంధిత కథనం