Ukraine war : రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు! ఇక అంతా ట్రంప్ చేతుల్లోనే..
Russia Ukraine war : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు సంకేతాలిచ్చారు. అంతేకాదు, ట్రంప్ ఉండి ఉంటే అసలు యుద్ధం జరిగేదే కాదని వ్యాఖ్యానించారు.
“యుద్ధాలు ఆపేస్తా” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే అంటున్న మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి! ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేయాలని ఆయన చేసిన విజ్ఞప్తికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత సానుకూలంగా స్పందించడం ఇందుకు కారణం. అంతేకాకుండా, ట్రంప్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

‘ట్రంప్ ఉండి ఉంటే అసలు యుద్ధం జరిగేదే కాదు!’
రష్యా- ఉక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరి నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, నాటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేవారమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అంతేకాదు, 2020 అమెరికా ఎన్నికల్లో నిజమైన విజేత జో బైడెన్ కాదని, తన గెలుపును దోచుకున్నారని ట్రంప్ చేసిన వాదనకు పుతిన్ మద్దతు తెలిపారు.
“2020లో అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఆయన గెలుపును దొంగిలించకపోయుంటే.. ఉక్రెయిత్‌తో అసలు యుద్ధమే జరిగేది కాదు,” అని పుతిన్ ఓ టీవీ రిపోర్టర్‌తో అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం, ఇంధన ధరల గురించి మాట్లాడుకోవడానికి తాను, డొనాల్డ్ ట్రంప్ కలుసుకోవాలని పుతిన్ అన్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం అమెరికా అధ్యక్షుడిని.. తెలివైన, ఆచరణాత్మకమైన వ్యక్తిగా పుతిన్ అభివర్ణించారు.
తమపై అమెరికా ఆంక్షలు విధిస్తే, అది ఆదేశానికే నష్టమని తెలిసి, ట్రంప్ ఆ నిర్ణయం తీసుకోరని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
“అమెరికా, రష్యా రెండింటికీ ఆసక్తి ఉన్న అన్ని రంగాలపై నేటి వాస్తవాల ఆధారంగా ప్రశాంతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. మేం సిద్ధంగా ఉన్నాం,” అని పుతిన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం వెంటనే ముగిసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ కోరిన మరుసటి రోజే పుతిన్ ఈ విధంగా స్పందించడం గమనార్హం!
ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఓవల్ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం హాస్యాస్పదంగా ఉందని, అనవసరమైన బాధలను కలిగిస్తోందని అన్నారు.
ఆయన (పుతిన్) ఒప్పందం కుదుర్చుకోవాలని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు.
“మీరు చూడటానికి ఇష్టపడని చిత్రాలు (యుద్ధం) నా వద్ద ఉన్నాయి. దశాబ్దాలుగా ఎన్నడూ చూడని సంఖ్యలో సైనికులు ప్రతిరోజూ చనిపోతున్నారు. ఆ యుద్దానికి ముగింపు పలికితే బాగుంటుంది. ఇది హాస్యాస్పదమైన యుద్ధం,” అని ట్రంప్ అన్నారు.
అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ట్రంప్- పుతిన్ చర్చలు ఎప్పుడు జరుగుతాయి? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. చర్చలకు రెడీ అని, పుతిన్‌ని కలుస్తానని ట్రంప్ గురువారం ప్రకటించారు. కానీ రష్యా మాత్రం.. ట్రంప్ నుంచి సమాచారం కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడి స్పందన..
డొనాల్డ్ ట్రంప్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్‌ని మభ్యపెట్టేందుకు పుతిన్ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు.
“అమెరికా అధ్యక్షుడు కోరుకుంటున్న శాంతిని తారుమారు చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. కానీ అది జరగదు,” అని జెలెన్స్కీ అన్నారు.
సంబంధిత కథనం