Elon Musk - US President: ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు అవుతారట!
Elon Musk - US President: అమెరికా అధ్యక్ష పదవిని ఎలాన్ మస్క్ చేపడతారంటూ రష్యా మాజీ అధ్యక్షుడు ఒకరు అంచనా వేశారు. మరిన్ని వింత జోస్యాలు కూడా చెప్పారు.
Elon Musk - US President: ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్.. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు అవుతారట. రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదెవ్ (Dmitry Medvedev) ఈ అంచనా వేశారు. కాగా, రష్యా ప్రస్తుతం ప్రెసిడెంట్ పుతిన్‍కు ఆయన వీరవిధేయుడు, అడ్వజరీ సెక్యూరిటీ కౌన్సిల్‍లోనూ కీలక పదవిలో ఉన్నారు. అమెరికాలో అంతర్యుద్ధం వస్తుందని, దీని కారణంగా మస్క్ ప్రెసిడెంట్‍గా అవుతారంటూ డిమిత్రి మెద్వెదెవ్ జోస్యం చెప్పారు. వెటకారంగా అలా చెప్పినట్టు కనిపిస్తోంది. కాగా, మరిన్ని వింత అంచనాలను కూడా ఆయన వెల్లడించారు.
జర్మనీ, ఫ్రాన్స్ మధ్య యుద్ధం!
కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ ఏం జరుగుతుందో ఊహిస్తున్నారని, తాను కూడా ఇందులో భాగమవుతన్నానంటూ రష్యా టాప్ అఫీషియల్ డిమిత్రీ మెద్వెదెవ్ ట్వీట్లు చేశారు. “నూతన సంవత్సరం రానున్న సందర్భంగా అందరూ అంచనాలు వెల్లడిస్తున్నారు. చాలా మంది విభిన్నమైన, జరిగేందుకు అవకాశం లేని, అసంబద్ధమైన వాటిని కూడా అంచనా వేస్తున్నారు. జోస్యం చెప్పేందుకు పోటీ పడుతున్నారు. దీనికి నేను కూడా సహకరిస్తున్నా. 2023లో ఏం జరగవచ్చంటే” అంటూ ట్వీట్లను మొదలుపెట్టారు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్. జర్మనీ, ఫ్రాన్స్ మధ్య యుద్ధం వస్తుందని, యూరప్ విడిపోతుందని ట్వీటారు.
అమెరికాలో అంతర్యుద్ధం వస్తుందని, దీంతో కాలిఫోర్నియా, టెక్సాస్ ఇండిపెండెంట్ స్టేట్లుగా మారతాయని డిమిత్రీ మెద్వెదెవ్ ట్వీట్ చేశారు. అనంతరం అంతర్యుద్ధం ముగిసిన తర్వాత జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ గెలుస్తారని రాసుకొచ్చారు. క్రూడ్ ఆయిల్ ధర బారెల్‍కు 150 డాలర్లకు పైగా చేరుతుందని, యూరోపియన్ యూనియన్‍లో బ్రిటన్ మళ్లీ చేరుతుందని, అమెరికా స్టాక్ మార్కెట్లన్నీ ఆసియాకు తరలివెళతాయంటూ ట్వీట్లు చేశారు. ఇలా ఏకంగా 11 అసాధారణ అంచనాలను వెల్లడించారు. అయితే ఇందులో ఎక్కువ శాతం అమెరికాపై వెకటారంతో ఆయన అంచనాలు వెల్లడించినట్టు కనిపిస్తోంది. సాధ్యమయ్యే అవకాశాలు లేని విషయాలనే మెద్వెదెవ్ ఎక్కువగా ప్రస్తావించారు.
డిమిత్రీ మెద్వెదెవ్ ట్వీట్లకు ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ‘ఎపిక్ థ్రెడ్’ అంటూ కామెంట్ చేశారు.
ప్రస్తుతం పుతిన్ అడ్వజరీ సెక్యూరిటీ కౌన్సిల్‍కు డిప్యూటీ హెడ్‍గా డిమిత్రీ మెద్వెదెవ్ ఉన్నారు. రష్యా ప్రధానిగా పుతిన్ ఉన్న సమయంలో మెద్వెదెవ్ నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా పని చేశారు.
కాగా, 44 బిలియన్ డాలర్లతో సోషల్ మీడియా నెట్‍వర్క్ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకోవడం 2022లో ప్రపంచంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల్లో ఒకటిగా నిలుస్తుంది. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నాక ఆయన.. సీఈవో పరాగ్ అగర్వాల్‍తో పాటు వేలాది మంది ఉద్యోగులను తీసేశారు. బ్లూటిక్ సబ్‍స్క్రిప్షన్ నుంచి అనేక విషయాల్లో సమూల మార్పులు చేస్తున్నారు.