Kamala Harris Smile: కమలా హారిస్ నవ్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర కామెంట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న, భారతీయ సంతతికి చెందిన కమల హ్యారిస్ నవ్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము కమల హ్యారిస్ కు సపోర్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రష్యాపై విధించిన ఆంక్షలను మర్చిపోబోమన్నారు. తాము డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కే సపోర్ట్ చేస్తామన్నారు. పైగా, ఆమె నవ్వుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బైడెన్ చెప్పారు..
గురువారం రష్యాలోని వ్లాదివోస్టోక్ లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తమకు ఫేవరెట్ అని, కానీ ఆయన ఈ ఎన్నికల రేసులో పాల్గొనడం లేదని, అందువల్ల ఆయన సూచించిన కమలా హారిస్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని పుతిన్ అన్నారు.
ఆమె నవ్వు ఇన్ఫెక్షియస్..
కమలా హారిస్ నవ్వును పుతిన్ ప్రశంసించారు. కమల హ్యారిస్ అందంగా నవ్వుతారని, ఆమె నవ్వు అద్భుతంగా ఉందని, పరిస్థితి అంతా బావుందన్న ఆత్మ విశ్వాాసాన్ని ఆమె నవ్వు సూచిస్తోందని పుతిన్ కామెంట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె బాగా రాణిస్తోందనడానికి ఇది నిదర్శనమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ను గురువారం పలు మీడియా ఛానళ్లు షేర్ చేశాయి.
ట్రంప్ రష్యా వ్యతిరేకి
గతంలో ఏ అధ్యక్షుడు విధించని విధంగా రష్యాపై ట్రంప్ (trump) చాలా ఆంక్షలు విధించారని పుతిన్ విమర్శించారు. హారిస్ (Kamala Harris) ఇలాంటి చర్యలు తీసుకోరని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమలా హారిస్ ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటారని అనుకుంటున్నానన్నారు. అయితే, ఎవరిని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలనేది అమెరికా ప్రజల ఇష్టమని, వారి ఎంపికను తాము గౌరవిస్తామని పుతిన్ అన్నారు.
పుతిన్ పై అమెరికా విమర్శలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (putin) వ్యాఖ్యలపై అమెరికా అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పుతిన్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జాన్ కిర్బీ స్పందిస్తూ.. 'మా ఎన్నికల గురించి మాట్లాడటం పుతిన్ మానుకోవాలి’’ అన్నారు. పుతిన్ ఎవరికీ అనుకూలంగా ఉండకూడదని, అమెరికా తదుపరి అధ్యక్షుడు (us presidential elections 2024) ఎవరో నిర్ణయించాల్సింది అమెరికా ప్రజలేనని అన్నారు.