Military mobilisation in Russia: పౌరుల నుంచి సైనికులను సమీకరిస్తాం: రష్యా
Military mobilisation in Russia: ఉక్రెయిన్ తో యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు తింటున్న రష్యా.. సైనిక దళాల బలోపేతం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పౌరుల నుంచి సైనికులను చేర్చుకునే దిశగా ఉత్తర్వులు జారీ చేసింది.
Military mobilisation in Russia: కొద్ది రోజుల్లోనే ముగించగలనన్న ఆత్మవిశ్వాసంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న వ్యూహాత్మక ప్రతి దాడులు నిద్రపట్టనివ్వడం లేదు. యుద్ధం మొదట్లో రష్యా స్వాధీనం చేసుకున్న పలు కీలక ప్రాంతాలను ఒకటొకటిగా ఉక్రెయిన్ తిరిగి వెనక్కు తీసుకుంటోంది.
ట్రెండింగ్ వార్తలు
Military mobilisation in Russia: పుతిన్ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సైనిక దళాల బలోపేతం లక్ష్యంగా పౌరుల నుంచి పాక్షిక సైనిక సమీకరణకు శ్రీకారం చుట్టారు. రష్యా అధికార టీవీలో ప్రసంగిస్తూ.. రష్యాను తుదముట్టించడానికి పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, వాటి ఆటలు సాగనివ్వనని శపథం చేశారు. రష్యా భూభాగాన్ని పరిరక్షించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతామన్నారు.
Military mobilisation in Russia: పాక్షిక సైనిక సమీకరణ
ఇందులో భాగంగానే, పాక్షిక సైనిక సమీకరణకు సిద్ధమయ్యామని పుతిన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన డిక్రీపై ఇప్పటికే సంతకాలు చేశానన్నారు. ఈ సమీకరణ ద్వారా 3 లక్షల మంది సైనికులుగా సాయుధ దళాల్లో చేరనున్నారు. వీరిలో ఇప్పటికే సైనిక శిక్షణ పొంది, రిజర్వ్ లో ఉన్న పౌరులు ఉంటారు. అలాగే, గతంలో సాయుధ దళాల్లో పని చేసిన వారికి, గతంలో యుద్ధాల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
Military mobilisation in Russia: స్వదేశంలోనూ వ్యతిరేకత
పుతిన్ నిర్ణయంపై పశ్చిమ దేశాలు మండిపడుతుండగా.. మరోవైపు, సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయానికి నిరసనగా దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ‘లక్షలాది రష్యన్లను బలవంతంగా యుద్ధం పేరుతో మృత్యు ఒడికి పంపుతున్నారు. ఎవరి కోసం వారు ఈ త్యాగం చేయాలి?’ అని వారు ప్రశ్నిస్తున్నారు.
Military mobilisation in Russia: రష్యాలో చేరడంపై ఓటింగ్
మరోవైపు, ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలు రెఫరెండం నిర్వహించుకోవాలని భావిస్తున్నాయి. రష్యాలో చేరే విషయంపై ప్రజాభిప్రాయం సేకరించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. లుహాన్క్స్, ఖేర్సన్, జపోరిజియా, డోనెస్క్ ప్రాంతాల్లో ఈ శుక్రవారం ఈ రిఫరెండం ప్రారంభం కానుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉక్రెయిన్, ఇతర పశ్చిమ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
Military mobilisation in Russia: పుతిన్ హెచ్చరిక
తన టెలివిజన్ ప్రసంగంలో పశ్చిమ దేశాలపై పుతిన్ నిప్పులు చెరిగారు. రష్యాను తుదముట్టించాలన్న పశ్చిమ దేశాల కుట్ర సఫలం కాబోదన్నారు. అణు దాడులు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కోగల ఆయుధ పాటవం రష్యాకు ఉందన్న విషయం మర్చి పోవద్దని హెచ్చరించారు. రష్యా భూభాగ పరిరక్షణకు సర్వశక్తులు ఒడ్డుతామన్నారు.
Military mobilisation in Russia: 5 వేల మంది మృతి
ఉక్రెయిన్ తో యుద్ధంలో ఇప్పటివరకు 5937 మంది రష్యా సైనికులు చనిపోయారని రష్యా వెల్లడించింది.