ఒడిశా పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుడిచా ఆలయం సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 50మందికిపైగా భక్తులు గాయపడినట్టు తెలుస్తోంది.
ఒడిశా పూరీలో ప్రతియేటా జరిగే జగన్నాథ రథయాత్రను వీక్షించేందుకు లక్షలాది మంది తరలివెళతారన్న విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, శుభద్రలతో కూడిన మూడు భారీ రథాలు జగన్నాథ ఆలయం నుంచి గుడిచా ఆలయానికి వెళతాయి.
కాగా, ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో పవిత్ర రథయాత్ర గుడిచా ఆలయం వద్దకు చేరుకుంటున్నప్పుడు, భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు కిందపడిపోయారు. ఆ వెంటనే పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు ఘటనాస్థలంలోనే మరణించారు. వారిలో ఇద్దరు మహిళలు (ప్రభాతి దాస్, బసంతి సాహు) ఉన్నారు. మరణించిన ముగ్గురు ఖుర్దా జిల్లావాసులని తెలుస్తోంది. ఈ ఘటనలో 50కిపైగా మంది గాయపడ్డారు.
రద్దీని నియంత్రించేందుకు అధికారులు చేపట్టిన చర్యల్లో లోపాలు ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది. అందుకే తొక్కిసలాట జరిగింది, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పూరీ కలెక్టర్ సిద్ధార్త శంకర్ స్వైన్ మీడియాకు తెలిపారు. జగన్నాత రథయాత్ర నేపథ్యంలో తగిన భద్రతా చర్యలు చేపట్టామని, కానీ భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి, నియంత్రణ కోల్పోయిందని, ఫలితంగా ఈ తొక్కిసలాట జరిగిందని వివరించారు.
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాటపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ యంత్రాంగంపై బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ సీఎం నవీన పట్నాయక్ విమర్శల వర్షం కురిపించారు.
“ఈ సమయంలో ప్రార్థనలు తప్ప ఏం చేయలేము. వీళ్లు సృష్టించిన అస్తవ్యస్త పరిస్థితులను జగన్నాథుడు క్షమించాలి,” అని పట్నాయక్ అన్నారు.
బీజేడీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.
“బీజేడీ పాలనలో రథయాత్ర వేళ చాలా తప్పులు జరిగాయి. జగన్నాథుడికి అవమానం జరిగింది. ఇప్పుడు తొక్కిసలాట విషయాన్ని రాజకీయం చేయడం సరైనది కాదు,” అని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్విరాజ్ హరిచందన్ తెలిపారు.
దేశంలో విషాదం మిగిల్చిన తాజా తొక్కిసలాట ఘటన ఇది. ఈ ఏడాది ఇప్పటికే అనేక చోట్ల తొక్కిసలాట ఘటనలు జరిగాయి. మహాకుంభమేళా నేపథ్యంలో యూపీలో, దిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ 2025 నేపథ్యంలో ఈ నెలలో బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విక్టరీ పెరేడ్లో సైతం తొక్కిసలాట చోటుచేసుకుంది.
సంబంధిత కథనం