Punjab | ‘లంచాలు ఇవ్వండి’ ప్రజలకు పంజాబ్ సీఎం బంపరాఫర్.. చివర్లో ట్విస్ట్!
లంచగొండి అధికారులపై పంజాబ్ సీఎం ఉక్కుపాదం మోపారు. ఇకపై ఏ అధికారి అయినా లంచం అడిగితే కాదనకుండా ఇచ్చేయమని ట్విస్ట్ ఇచ్చారు. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదవండి.
Chandigarh | ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఊదేసి, హేమాహేమీలను సైతం ఓడించి.. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై సంచలనం సృష్టించిన భగవంత్ మాన్ ఈరోజు మరో సంచలనానికి తెరలేపారు.
"పంజాబ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. పంజాబ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండరు. అదేంటో త్వరలో ప్రకటిస్తాను... ” అని సీఎం భగవంత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
దీంతో అంతపెద్ద నిర్ణయం ఏమై ఉంటుందా? అని అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూశారు. దీనిని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కూడా రీట్వీట్ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కొత్త సీఎం ప్రకటన గురించి వేచిచూస్తుండగా ఇంతలో ఆ ప్రకటన రానే వచ్చింది. రాష్ట్రంలో అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించబోతున్నానరనేది ఆయన ప్రకటన సారాంశం.
అయితే ఇందులో ఏముంది విషయం అనుకుంటున్నారా? అక్కడే సీఎం సార్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ హెల్ప్‌లైన్ నెంబర్ ఏదో నామమాత్రమైంది కాదు, ఎందుకంటే అది నేరుగా సీఎం ఉపయోగించే వాట్సాప్ నెంబరేనట.
సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. ‘భగత్ సింగ్ ప్రాణత్యాగం రోజున మార్చి 23న షహీద్ దివస్ (అమరుల దినోత్సవం) పురస్కరించుకొని అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేస్తున్నాము. అది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇకపై ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే, నిరాకరించకుండా దాని వీడియో/ఆడియో రికార్డ్ చేసి నాకు పంపండి. అలాంటి అవినీతిపరులపై కఠినాతికఠినమైన చర్యలు తీసుకుంటాం పంజాబ్‌లో ఇక లంచం మాటే వినబడదు’ అని అన్నారు.
నూటికి తొంభై తొమ్మిది శాతం నిజాయితీపరులే ఉంటారు. అయితే 1 శాతం అవినీతిపరుల వల్ల మొత్తం వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని సీఎం భగవంత్ అన్నారు.
కాగా, పంజాబ్ సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారంటూ దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు చాలా అభినందనలు తెలిపారు.
ఏదేమైనా పంజాబ్ సీఎం నిర్ణయంపై పలు వర్గాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతుంది. నేరుగా సీఎం ఉపయోగించే నెంబర్ ఇస్తుండటంతో ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం