పూణె పోర్షే ఘటనకు ఏడాది- న్యాయం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు..-pune porsche case year later victims families still await justice ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పూణె పోర్షే ఘటనకు ఏడాది- న్యాయం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు..

పూణె పోర్షే ఘటనకు ఏడాది- న్యాయం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు..

Sharath Chitturi HT Telugu

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె పోర్షే ఘటనకు ఏడాది పూర్తైనప్పటికీ, బాధిత కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయ పోరాటం ఆలస్యమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన పోర్షే కారు.. (HT photo)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే ఘటనకు మే 19తో ఏడాది పూర్తయింది. తాగిన మత్తులో విపరీతమైన వేగంతో పోర్షే కారు నడిపిన ఓ మైనర్​.. కల్యాణి నగర్​ ప్రాంతంలో ఇద్దరిని ఢీకొట్టాడు. వారిద్దరు మరణించారు. కాగా ఈ ఘటనకు ఏడాది పూర్తైనా, మృతులు అనీష్​ అవధియా, అశ్విని కోస్టాల కుటుంబాలు న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు! న్యాయ ప్రక్రియ చాలా ఆలస్యంగా సాగడంపై అవధియా కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

పూణె పోర్షే కేసు బాధిత కుటుంబాల ఆవేదన..

పూణె పోర్షే కేసు మృతుని తండ్రి ఓం అవధియా మాట్లాడుతూ.. "ఏడాది గడిచినా విచారణను పొడిగిస్తున్నారు. మా అబ్బాయి ఇప్పుడు మనతో లేడు. ఆ నష్టాన్ని ఏదీ భర్తీ చేయదు. కానీ ఈ కేసులో న్యాయం దక్కితే, మద్యం సేవించి వాహనాలు నడపడం- డబ్బు, అధికారం అనేది చట్టానికి అతీతం కాదని బలమైన సందేశాన్ని పంపుతుంది." అని అన్నారు.

త్వరితగతిన దర్యాప్తు, విచారణ చేపడతామని తొలుత హామీ ఇచ్చినప్పటికీ, ఈ కేసులో పురోగతి అంతంత మాత్రంగానే ఉందని అన్నారు.

పుణె పోర్షే కేసులో ట్యాంపరింగ్ కేసులో ప్రస్తుతం తొమ్మిది మంది జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బాలుడి తండ్రి, వైద్యులు అజయ్ తవారే, శ్రీహరి హల్నోర్, ఆసుపత్రి ఉద్యోగి అతుల్ ఘట్కాంబ్లే, మధ్యవర్తులు బష్పాక్ మకందర్, అమర్ గైక్వాడ్ కూడా కస్టడీలో ఉన్నారు. ఆదిత్య అవినాష్ సూద్, ఆశిష్ మిట్టల్, అరుణ్ కుమార్ సింగ్ తదితరులు ఉన్నారు. బాలుడి తల్లి మధ్యంతర బెయిల్​పై బయటకు వచ్చింది.

ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) సభ్యుడు ఎల్ ఎన్ దానవాడే 17 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని వివాదాస్పదంగా బెయిల్ మంజూరు చేశారు.

రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయడం కూడా బెయిల్ షరతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరగా, మైనర్​ను అబ్జర్వేషన్ హోమ్​లో కొన్ని రోజులు ఉంచి బాంబే హైకోర్టు విడుదల చేసింది.

విచారణను వేగవంతం చేయాలని మృతుల కుటుంబాలు అధికారులకు విజ్ఞప్తి చేశాయని అవధియా తెలిపారు. “ఈ ఏడాది మొత్తం నాకు, నా భార్యకు, మా కుటుంబం మొత్తానికి బాధాకరంగానే గడిచింది. అతన్ని స్మరించుకోకుండా, అందమైన జ్ఞాపకాలను నెమరువేసుకోకుండా ఒక్క రోజు కూడా గడవలేదు. అనీష్ మరణం తర్వాత మా ప్రపంచం కుప్పకూలిపోయింది,” అని అన్నారు.

నిందితులపై అభియోగాలు నమోదు చేయడం ద్వారా కేసును వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే డాక్టర్ తవారే దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ కారణంగా జాప్యం జరిగిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హిరే తెలిపారు.

“నిందితుల బెయిల్ పిటిషన్లను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. విచారణ వేగవంతం అయ్యేందుకు ఇప్పటికే అభియోగాలు నమోదు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాం. అయితే ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతూ డాక్టర్ తవారే కోర్టును ఆశ్రయించారు. అందుకే ప్రొసీడింగ్స్ పెండింగ్​లో ఉన్నాయి,” అని హిరే పేర్కొన్నారు.

“ఈ కేసులో నిందితుడి బ్లడ్​ శాంపిల్​ రిపోర్టులు వంటి కీలక సాక్ష్యాలను తారుమారు చేసి న్యాయవ్యవస్థను మోసం చేశారు. ప్రాసిక్యూషన్ తీవ్ర వ్యతిరేకత కారణంగా మైనర్ బాలుడి తల్లి మినహా నిందితులెవకి బెయిల్ రావడం లేదు,” అని స్పష్టం చేశారు.

బలమైన కేసును కోర్టులో ప్రవేశపెట్టడానికి మొదటి నుంచి తగిన శ్రద్ధతో దర్యాప్తును నిర్వహించామని పుణె సీనియర్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

మద్యం సేవించడాన్ని కప్పిపుచ్చుకునేందుకు బాలుడి రక్తనమూనాలను తల్లి రక్తనమూనాలతో మార్చినట్టు పుణె పోలీసులు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు, ససూన్ జనరల్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, దళారులను అరెస్టు చేశారు.

పుణే పోర్షే కేసు ఏంటంటే..

మే 19 తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో పార్టీ నుంచి తిరిగి వస్తుండగా అవధియా, కోస్టా ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్​ను పోర్షే కారుతో మైనర్​ ఢీకొట్టాడు. బైక్​పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో పోర్షేలో ఇద్దరు మైనర్ స్నేహితులు, ఒక డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం.

17 ఏళ్ల యువకుడు రెండు హోటళ్లలో పార్టీలకు హాజరయ్యాడని, మద్యం సేవించి రిజిస్టర్ చేసుకోని పోర్షే కారును నడిపాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో పుణె పోలీస్ చీఫ్ అమితేష్ కుమార్ ఇద్దరు ఎరవాడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

మైనర్ తండ్రి, ససూన్ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ తవారే, డాక్టర్ హల్నార్, సిబ్బంది ఘట్కాంబ్లే సహాయంతో నమూనా మార్పిడిని నిర్వహించారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. మధ్యవర్తులు మకందర్, గైక్వాడ్ ఈ చట్టానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిర్వహించారని ఆరోపించారు. వాహనంలో ఉన్న మరో ఇద్దరు మైనర్ల రక్తనమూనాలను కూడా ఇలాగే తారుమారు చేశారని, ఫలితంగా వారి తండ్రులను అరెస్టు చేశామని పోలీసులు ఆరోపించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.