దేశంలో ఐటీ హబ్‌గా పేరొందింది బెంగళూరు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి అనేక మంది ఉద్యోగం కోసం వస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో బెంగళూరు ట్రాఫిక్, లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి.. పూణె నుంచి 40శాతం పే- హైక్‌తో రూ. 25లక్షల ప్యాకేజ్‌తో బెంగళూరుకు వెళ్లాడు. కానీ ఏడాది తిరగకుండానే, బెంగళూరుకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని ఫీల్ అవుతున్నాడు. అసలేం జరిగిందంటే..
బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న స్థిరాస్తి ధరలు కొత్తవారికి ప్రధాన ఆందోళనగా మారుతున్నాయి. నగరంలో ఉంటే తమ ఆర్థిక పరిస్థితి మెరుగైన జీవన నాణ్యతకు దోహదం చేస్తాయా? అని చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
పుణెలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి 40% వేతన పెంపు కోసం బెంగళూరులోని ఒక కంపెనీలో చేరిన తన స్నేహితుడి అనుభవాన్ని ఇషాన్ అరోరా అనే వ్యక్తి లింక్డ్ఇన్లో షేర్ చేశాడు. 18 ఎల్పీఏ ప్యాకేజ్ నుంచి 25 ఎల్పీఏకి పెరిగింది. కానీ అతను ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడట, పూణెలో ఉండి ఉంటే బాగుండేదని ఫీల్ అవుతున్నాడట.
"ఇక్కడ అద్దెలు అకారణంగా ఎక్కువగా ఉన్నాయి. ఓనర్లు మూడు నుంచి నాలుగు నెలల అద్దె కోసం భారీ సెక్యూరిటీ డిపాజిట్లను డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పరిస్థితి భయంకరంగా ఉంది. ఇది ప్రయాణాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చింది. పుణెలో, నేను కేవలం 15 రూపాయలకు వడా పావ్ని ఆస్వాదించగలిగాను. పొదుపు చేయగలిగాను. ఇక్కడ, ఎక్కువ సంపాదించినప్పటికీ, నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయని నేను భావిస్తున్నాను," అని తన స్నేహితుడు చెప్పిన మాటలను అరోరా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖర్చులు విపరీతంగా పెరుగుతుండటంతో బెంగళూరులో 35-40 ఎల్పీఏ వరకు జీతాలు కూడా ఆర్థిక సౌకర్యాన్ని కల్పించలేవని కొందరు యూజర్లు అభిప్రాయపడుతున్నారు.
'ఈ నగరం మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తుంది. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి ప్రతిరోజూ ఒక పోరాటంలా అనిపిస్తుంది," అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
ఇంకొందరు మాత్రం బెంగళూరు బతికేందుకు రూ. 5,6 లక్షల ఉన్నా చాలంటున్నారు.
"ఆర్థిక నిర్వహణలో లైఫ్‌స్టైల్ ఛాయిస్‌లు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. బెంగళూరులో ప్రతి ఒక్కరూ 25 ఎల్పీఏ సంపాదించడం లేదు. చాలా మంది ప్రజలు 5-6 ఎల్పీఏతో హాయిగా జీవిస్తున్నారు. మీ ఖర్చులను మీరు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది,' అని ఓ యూజర్ కౌంటర్ ఇచ్చారు.
మరి మీరేం అంటారు? బెంగళూరులో రూ. 25లక్షల ప్యాకేజ్ నిజంగా సరిపోదా?
సంబంధిత కథనం