టీచర్‌పై స్కూల్ యజమాని అత్యాచారం
ఓ టీచర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డందుకు గాను స్కూలు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడినందుకు ఆ పాఠశాల యజమానిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఫిబ్రవరిలో స్కూల్ యజమాని తనపై మొదటిసారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆ ఘటనను వీడియో రికార్డింగ్ కూడా చేశాడని టీచర్ ఆరోపించింది. ఆ రికార్డింగ్‌ని ఉపయోగించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి, పదే పదే అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.
‘సెక్టార్ సిగ్మా 2లోని ఓ పాఠశాల యజమాని సాధారణ విధుల కోసం పాఠశాలలో ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన పనుల సాకుతో ఉపాధ్యాయినిని తన కార్యాలయానికి పిలిచాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు’ అని పోలీసు అధికారి తెలిపారు.
‘ఇటీవల ఉపాధ్యాయురాలు తన భర్తకు జరిగిన సంఘటన గురించి చెప్పింది. ఆ తర్వాత ఈ జంట పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. గత వారం స్థానిక సెక్టార్ బీటా 2 పోలీస్ స్టేషన్‌లో ఈ విషయాన్ని నివేదించారు’ అని అధికారి తెలిపారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (అత్యాచారం), 507 (అజ్ఞాత కమ్యూనికేషన్ ద్వారా నేరపూరిత బెదిరింపు) కింద సెప్టెంబర్ 29 న ఎఫ్ఐఆర్ నమోదు అయింది. దర్యాప్తు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు.
మంగళవారం నిందితుడిని చుహద్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో అడ్డగించి, సెక్టార్ బీటా 2 పోలీస్ స్టేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల ప్రకారం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.