Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై
Crime news: తన స్కూల్ లో చదువుకుంటున్న ఒక ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గురించి ఆ చిన్నారి తన తల్లికి చెప్పడంతో ఈవిషయం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసుల అరెస్ట్ చేశారు. పోలీస్ కేసు పెట్టవద్దని తల్లిపై ఒత్తిడి తెచ్చిన ఏఎస్సైని కూడా అరెస్ట్ చేశారు.
Crime news: తన పాఠశాలలో చదువుకుంటున్న 8 ఏళ్ల బాలికపై ఆ స్కూల్ ఓనర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. స్కూల్ కు సంబంధించిన హాస్టల్ ఆవరణలో ఆ బాలికపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు రెండు వారాల తర్వాత భోపాల్ లోని ఓ ప్రైవేట్ పాఠశాల యజమానిని అరెస్టు చేశారు. అత్యాచార ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని మైనర్ బాలిక తల్లిపై ఒత్తిడి తెచ్చిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రకాశ్ రాజ్ పుత్ ను కూడా అదుపులోకి తీసుకుని సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని గుర్తింపు
తనపై అత్యాచారం జరిపిన నిందితుడిని ఆ బాలిక గుర్తించిన తర్వాత ఆ స్కూల్ ఓనర్ అయిన మినిరాజ్ మోదీని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సోమవారం అరెస్టు చేసిందిని భోపాల్ సిటీ (జోన్ 2) డిప్యూటీ పోలీసు కమిషనర్ (DCP) శ్రద్ధా తివారీ తెలిపారు. ప్రస్తుతం మినిరాజ్ మోదీని పోలీసు కస్టడీలో ఉంచి విచారిస్తున్నామని, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని తివారీ తెలిపారు. ఇదిలా ఉండగా. పోలీసులు నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని బాలిక తల్లి ఆరోపించారు. కేసు నమోదు చేయవద్దని ఏఎస్సై రాజ్ పుత్ తనపై ఒత్తిడి పెంచాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే షాక్ లో ఉన్న తన కూతురికి పోలీసులు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమెను మరింత బాధకు గురి చేశారని ఆరోపించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 30న మోదీపై ఎఫ్ ఐఆర్ నమోదైంది.
రెండు సార్లు వైద్య పరీక్షలు
‘‘ఏప్రిల్ చివరి వారంలో నా కుమార్తెపై అత్యాచారం జరిగింది. ఏప్రిల్ 29న నా కూతురు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నాతో పంచుకోవడంతో నాకు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగిందని, ప్రైవేట్ భాగాల్లో గాయమైందని వైద్యులు కూడా ధృవీకరించారు. కానీ ఏఎస్సై రాజ్ పుత్ ఆసుపత్రికి వచ్చి నిందితుడిపై కేసు పెట్టవద్దని నాపై ఒత్తిడి పెంచాడు’’ అని ఆ మహిళ తెలిపింది. ‘‘అనంతరం, ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. వారు కూడా అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు’’ అని ఆమె వివరించారు. ఆ తరువాత తన కూతురికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించిందని తెలిపింది. "నా కుమార్తె వయస్సు కేవలం ఎనిమిదేళ్ళు. ఇప్పటికే ఆమె షాక్ కు గురై ఉంది. కానీ పోలీసులు అనుసరించిన మొత్తం ప్రక్రియ ఆమెను మానసికంగా వేధించింది" అని ఆమె అన్నారు. కాగా, తాను నిర్దోషిని అని, తనపై కుట్ర జరిగిందని నిందితుడైన మినిరాజ్ మోదీ చెప్పారు. ఎఫ్ఐఆర్ లో హాస్టల్ వార్డెన్ తో సహా ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.