PM Modi Road Show: ‘ఎన్నికల’ కర్ణాటకలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో: మాండ్యాపై స్పెషల్ ఫోకస్!-prime minister narendra modi holds mega roadshow in karnataka mandya ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Prime Minister Narendra Modi Holds Mega Roadshow In Karnataka Mandya

PM Modi Road Show: ‘ఎన్నికల’ కర్ణాటకలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో: మాండ్యాపై స్పెషల్ ఫోకస్!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 12, 2023 01:11 PM IST

PM Modi Roadshow in Karnataka: కర్ణాటకలోని మాండ్యాలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో నిర్వహించారు. దారి పొడవునా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

PM Modi Road Show: ‘ఎన్నికల’ కర్ణాటకలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో
PM Modi Road Show: ‘ఎన్నికల’ కర్ణాటకలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో (HT Photo)

PM Narendra Modi Roadshow in Karnataka: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (మార్చి 12) కర్ణాటక పర్యటనకు వచ్చారు. మరో మూడు నెలల్లోగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంపై అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మళ్లీ గెలువాలని పట్టుదలగా ఉంది. ప్రధాని మోదీ సైతం ఆ రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మరోసారి కర్ణాటకకు వచ్చారు. ఈ సందర్భంగా మాండ్యా(Mandya)లో మెగా రోడ్‍షో నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

ఘన స్వాగతం.. పూల వర్షం

PM Narendra Modi Roadshow in Karnataka: మాండ్యాలో రోడ్‍షో కోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్‍షో జరిగిన రహదారి పొడవునా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మోదీపై పూల వర్షం కురిపించారు. నేడు బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‍వేను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జాతికి అంకితం చేయనున్నారు. అలాగే మైసూరు - కుశాల్‍నగర్ హైవేకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఐఐటీ ధర్వాడ్‍ను మోదీ ప్రారంభిస్తారు. మొత్తంగా సుమారు రూ.16వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు.

మాండ్యాపై ప్రత్యేక దృష్టి

Mandya - BJP: మాండ్యా జిల్లాలో జనతా దళ్ సెక్యులర్ (JDS) పార్టీకి బలమైన పట్టు ఉంది. ఓల్డ్ మైసూర్ పరిధిలోని 8 జిల్లాల్లో మాండ్యా ఒకటిగా ఉంది. 2018 ఎన్నికల్లో కోస్టల్ కర్ణాటక, ముంబై-కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ సత్తాచాటింది. అయితే ఓల్డ్ మైసూరు పరిధిలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. జేడీఎస్, కాంగ్రెస్ ఆ ప్రాంతంలో బలంగా ఉన్నాయి. దీంతో ఈ ఓల్డ్ మైసూర్ పరిధిలో ముఖ్యమైన మాండ్యా జిల్లాపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ప్రధాని మోదీతో ఇక్కడ మెగా రోడ్‍షోను బీజేపీ నిర్వహించింది.

ముఖ్యంగా మాండ్యా జిల్లాలో జేడీఎస్‍కు ప్రాబల్యం ఉంది. 2018 ఎన్నికల్లో జిల్లాలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లను జేడీఎస్ దక్కించుకుంది. అయితే కృష్ణరాజపేట్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ టికెట్‍పై గెలిచిన నారాయణ గౌడ 2019లో బీజేపీలో చేరారు. రాజీనామా చేసి.. బీజేపీ తరఫున ఉప ఎన్నికలో గెలిచారు. దీంతో జేడీఎస్ కంచుకోటలో బీజేపీకి తొలి సీటు వచ్చింది. ఇప్పుడు మాండ్య పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి.. ఆ జిల్లాలో బలాన్ని పెంచుకునేందుకు అధికార కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మోదీ మెగా రోడ్‍షోను కూడా మాండ్యాలోనే భారీగా ఏర్పాటు చేసింది.

IPL_Entry_Point