Vande Bharat Express: నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన ప్రధాని
Vande Bharat Express: దేశంలో నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.
సిమ్లా, అక్టోబర్ 13: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్ నుండి దేశంలోని నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా - న్యూఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది.
‘కొత్త వందే భారత్ రైలు మునుపటి వాటితో పోలిస్తే అధునాతన వెర్షన్. చాలా తేలికైనది. తక్కువ వ్యవధిలో అధిక వేగాన్ని చేరుకోగలదు..’ అని అధికారులు తెలిపారు.
ఈ రైలు బుధవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనాలో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలును అందుబాటులోకి తేవడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధి చెందుతుంది. సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.
అంతకుముందు ఉనాలోని పెఖుబేలా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ స్వాగతం పలికారు.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం ఉనా, చంబా జిల్లాల్లో జరిగే రెండు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారు.
గత ఐదేళ్లలో ప్రధాని హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం ఇది తొమ్మిదోసారి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.