ఆయా గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ దరఖాస్తులను ఇకపై ఆరు నెలల్లోగా ప్రాసెస్ చేయాలని సిఫారసు చేసింది. ఈ ప్రక్రియ ఆమోదం పూర్తయితే వేలాది మంది ఇండియన్-అమెరికన్లకు నెత్తి మీద పాలు పోసినట్టవుతుంది. ఈ గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నవారు కూడా ఉన్నారు.
అమెరికాకు వచ్చే ఇమిగ్రెంట్లు అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు ఇచ్చే అధికారిక డాక్యుమెంటే గ్రీన్ కార్డు. హెచ్-1 బీ వర్క్ వీసాపై వచ్చే అత్యున్నత నైపుణ్యం కలిగిన భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రస్తుత ఇమిగ్రేషన్ సిస్టమ్ కారణంగా తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. శాశ్వత నివాసం లేదా గ్రీన్ కార్డు కేటాయించాలంటే ఇప్పుడున్న ఇమిగ్రేషన్ కోటాలో దేశానికి ఏడు శాతం మాత్రమే కోటా ఉంది. దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏషియా ఖండానికి చెందినవారు, హవాయి దేశస్తులు, పసిఫిక్ దీవుల పౌరులకు గ్రీన్ కార్డు విషయంలో తాజాగా అధ్యక్ష సలహా కమిషన్ సిఫారసులు ఇప్పుడు అనుమతి కోసం వైట్ హౌజ్‌కు చేరనున్నాయి.
ఏషియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్ ద్వీపవాసుల (పీఏసీఏఏఎన్హెచ్పీఐ) సమావేశంలో ప్రముఖ ఇండియన్ - అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భుటోరియా ఈ అంశాన్ని ప్రతిపాదించారు. ఆయా దేశాలకు సంబంధించిన కమిషనర్లు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. గతవారం దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశాన్ని వెబ్‌కాస్ట్ ద్వారా ప్రసారం చేశారు.
గ్రీన్ కార్డు దరఖాస్తులు పెరిగిపోతుండడంతో ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియ , విధానం సమీక్షించాలని, ప్రక్రియను స్ట్రీమ్ చేస్తూ కొత్తగా కాలావధి నిర్ణయించాలని, ప్రక్రియను సరళతరం చేయాలని సలహా కమిషన్ యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్‌కు సిఫారసు చేసింది. మాన్యువల్ అనుమతులను వేగవంతం చేసేందుకు అధునాతన ప్రక్రియను అనుసరించాలని, ఈ దిశగా అంతర్గత డాష్‌బోర్డులు, రిపోర్టింగ్ ప్రక్రియను మెరుగుపరచాలని సిఫారసు చేసింది.
ఫ్యామిలీ ఆధారిత గ్రీన్ కార్డు దరఖాస్తులు, డీఏసీఏ రెన్యువల్స్, ఇతర అన్ని గ్రీన్ కార్డు దరఖాస్తులు ఆరు నెలల్లోగా పరిష్కరించే లక్ష్యంతో ఈ సిఫారసులు చేసింది.
మూడు నెలల్లో.. అంటే ఆగస్టులోగా అదనంగా 100 శాతం గ్రీన్ కార్డు దరఖాస్తులు, ఇంటర్వ్యూలు ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉండేలా అధికారులను నియమించుకోవాలని నేషనల్ వీసా సెంటర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఫెసిలిటీకి సిఫారసు చేసింది. అలాగే గ్రీన్ కార్డు దరఖాస్తులు వీసా ఇంటర్వ్యూలు, నిర్ణయాలపై అడ్జుడికేషన్ కోసం ఏప్రిల్ 2023 నాటికి అదనంగా 150 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉండేలా అధికారులను నియమించాలని సిఫారసు చేసింది. అలాగే గ్రీన్ కార్డు వీసా ఇంటర్వ్యూలు, వీసా ప్రాసెసింగ్ టైమ్ లైన్ కూడా గరిష్టంగా 6 నెలలు మాత్రమే ఉండాలని సిఫారసు చేసింది.
ఇమ్మిగ్రెంట్స్ దేశంలో ఉండడానికి, వర్క్ చేయడానికి ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో వర్క్ పర్మిట్లు, ప్రయాణ పత్రాలు, తాత్కాలిక స్థితి పొడిగింపుల కోసం వచ్చే అభ్యర్థనలను మూడు నెలల్లో సమీక్షించి నిర్ణయాలు వెలువరించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
2021 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులో ఉన్న వార్షిక 226,000 గ్రీన్ కార్డ్‌లలో 65,452 కుటుంబ ప్రాధాన్యత గ్రీన్ కార్డ్‌లు మాత్రమే జారీ అయ్యాయి. వందల వేల గ్రీన్ కార్డ్‌లు జారీ కాలేదు. ఇవి భవిష్యత్తులో చాలా వరకు శాశ్వతంగా వృధా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ జాప్యం కారణంగా చాలా కుటుంబాలు కలిసి ఉండలేకపోయిన దుస్థితి ఏర్పడింది.
మార్చిలో 4,36,700 ఇంటర్వ్యూలు పెండింగ్‌లో ఉండగా, ఏప్రిల్‌లో 4,21,358 ఇంటర్వ్యూలు పెండింగ్‌లో ఉన్నాయని భూటోరియా పాలసీ పేపర్లో పేర్కొన్నారు.