Mahakumbh Stampede: మహాకుంభ మేళాలో విషాదం; తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు మృతి!
Mahakumbh Stampede: మహాకుంభ మేళాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య కావడంతో బుధవారం తెల్లవారుజామున అమృత స్నానం ఆచరించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
Mahakumbh Stampede: ప్రయాగ్‌రాజ్ మహకుంభ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటన తరువాత బుధవారం కొద్దిసేపు అమృత్ స్నాన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

భారీగా జనం తరలిరావడంతో..
బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అమృత స్నానం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ప్రమాదం జరిగింది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపడ్డాయి. పలువురు భక్తులు కింద పడిపోయారు. మరోవైపు, చీకట్లో ఇనుప డస్ట్ బిన్ లు కనిపించపోవడంతో, అవి తగిలి కొందరు కిందపడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను మహకుంభ్ సెంట్రల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మౌని అమవాస్య కావడంతో పుణ్య స్నానాల కోసం భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగం వద్దకు తరలివచ్చారు.
డీఐజీ ప్రకటన
మహా కుంభమేళా (mahakumbh mela 2025) లో బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఇన్ జనరల్ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 36 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారిని వారి కుటుంబ సభ్యులతో పంపించారు. మహాకుంభమేళాలోని సంగం ప్రాంతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటైన మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
అమృత స్నానాలు ప్రారంభం
పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, జునా అఖాడా, మరో ఇద్దరు అఖాడాలతో కలిసి మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో అమృత్ స్నానానికి వెళ్తారని వైభవ్ కృష్ణ తెలిపారు. 'జునా అఖాడాతో పాటు మరో ఇద్దరు అఖాడాలు అమృత్ స్నానానికి వెళ్తున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. పరిస్థితి అదుపులో ఉంది... చాలా మంది భక్తులు ఉన్నందున, అఖారాలు తమ అమృత్ స్నానాన్ని ఆలస్యం చేస్తామని మాకు ప్రతిపాదించారు" అని డిఐజి చెప్పారు.
అసలేం జరిగింది..
- సాధువుల ఊరేగింపు కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకేందుకు భక్తులు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
- రద్దీ కారణంగా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి 2 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. జనం బారికేడ్లను బద్దలు కొట్టి అవతలి వైపుకు దూకి అక్కడ వేచి ఉన్న వారిపై పడ్డారు. గాయపడిన 90 మందిని ఆసుపత్రికి తరలించగా, వారిలో 30 మంది మరణించారని డీఐజీ మీడియా సమావేశంలో తెలిపారు.
- మృతుల సంఖ్యను విడుదల చేయడానికి అధికారులకు 16 గంటలకు పైగా సమయం పట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంఘటనను "చాలా విచారకరం" అని పేర్కొన్నారు.తన సంతాపాన్ని తెలియజేశారు.
- 'త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల దగ్గర పుణ్య స్నానాలు చేయండి. అధికారుల ఆదేశాలు, సూచనలు పాటించండి. వారికి సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మవద్దు.' అని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం
‘‘అకస్మాత్తుగా జనం ఒక్కసారిగా రావడంతో చాలా మంది కిందపడిపోయారు. రద్దీ అదుపు తప్పింది" అని యాత్రికురాలు సరోజిని చెప్పారు. తప్పించుకునే అవకాశమే లేదని, అన్ని వైపుల నుంచి నెట్టేశారన్నారు. అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని స్నానాలు వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నామని, బసంత్ పంచమి నాడు స్నానాలు ఉంటాయని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi).. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు.