Maha Kumbha Mela : మహా కుంభమేళాకు వెళుతుండగా ఘోర ప్రమాదం! 10మంది దుర్మరణం
Maha Kumbha Mela accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు వెళుతున్న ఓ కారు.. ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది మరణించారు. మరో 19మంది గాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో మహా కుంభమేళాకు వెళుతున్న ఓ కారు.. మీర్జాపూర్- ప్రయాగ్‌రాజ్ హైవేపై ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది మరణించారు. మరో 19మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు వెళుతున్న ఓ బొలెరో కారు.. యూపీ మేజా పోలీస్‌స్టేషన్ సమీపంలో ఓ బస్సును ఢీకొట్టింది.
కుంభమేళా సందర్భంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కి వెళుడగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్నట్లు సమాచారం.
ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి, మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్వరూప్ రాణి నెహ్రూ మెడికల్ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని యమునానగర్ డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.
ప్రమాదానికి కారణం ఏంటి?
మహా కుంభమేళాకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, బొలెరో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని స్పష్టం చేశారు.
కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం..
కుంభమేళా నేపథ్యంలో రోడ్డు ప్రమాదం జరగడం.. ఈ వారంలో ఇది రెండోసారి! కుంభమేళా నుంచి ఆంధ్రప్రదేశ్‌కి తిరిగి వస్తుండగా మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
జబల్పూర్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలోని హైవేపై రాంగ్ సైడ్‌లో వెళ్తున్న ట్రక్కు.. మినీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా తెలిపారు.
రాంగ్ రూట్లో వెళుతున్న ట్రక్.. మినీ బస్సును ఢీకొట్టడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. వెంటనే పరుగులు తీసి సహాయక చర్యలు చేపట్టారు.
అదే రోజు జరిగిన మరో ఘటనలో ట్రక్కు, ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు మహా కుంభమేళాకు హాజరై తిరిగి వస్తుండగా బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతానీ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
సంబంధిత కథనం
టాపిక్