Prakash Karat: సీతారాం యేచూరి స్థానంలో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కరత్
Prakash Karat: పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత ప్రకాశ్ కరత్ ను సీపీఎం నియమించింది. ఈ పదవిలో ప్రకాశ్ కరత్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉంటారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యేచూరి ఆకస్మిక మరణం నేపథ్యంలో ప్రకాశ్ కరత్ ను ఆ పదవిలో నియమించారు.
Prakash Karat: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కరత్‌ను పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఆయన ఏప్రిల్ వరకు ఆ బాధ్యతల్లో ఉంటారు. ఇటీవల (సెప్టెంబర్ 12న) అనారోగ్యంతో మరణించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్థానాన్ని తాత్కాలికంగా ప్రకాష్ కరత్‌తో భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు ఆపార్టీ నిర్ణయాధికార కమిటీ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర కమిటీ సమావేశాలు
రెండు రోజుల పాటు జరిగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ (హెచ్‌కేసీ)లో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కరత్‌ను కేంద్ర కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఢిల్లీలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) సెంట్రల్ కమిటీ 24వ పార్టీ మహాసభ జరిగే వరకు (2025 ఏప్రిల్‌లో మధురైలో) సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్‌ను పొలిట్ బ్యూరో, అలాగే సెంట్రల్ కమిటీకి సమన్వయకర్తగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. సీపీఎం ప్రస్తుత జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సీతారాం ఏచూరి విచారకరమైన, ఆకస్మిక మరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’’ అని ఆ ప్రకటనలో సీపీఎం కేంద్ర కమిటీ కార్యాలయం తరపున ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్ పేర్కొన్నారు.
పదేళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కరత్
సీపీఎం నేత ప్రకాష్ కరత్ ఇప్పటికే పదేళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1948 ఫిబ్రవరి 7న నాటి బర్మా (మయన్మార్)లోని లేత్‌పదన్‌లో నాయర్ కుటుంబంలో ప్రకాశ్ కరత్ జన్మించారు. ఆయన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ను వివాహం చేసుకున్నారు. జేఎన్‌యూలో ఎస్ఎఫ్ఐలో పని చేస్తూనే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీపీఎంలో చేరారు. 1982-85 మధ్య సీపీఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ కరత్, 1985లో సీపీఎం కేంద్ర కమిటీలోకి ఎన్నిక అయ్యారు. ఆ తరువాత 1992లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. 2005లో ఢిల్లీలో జరిగిన సీపీఎం 18వ మహాసభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు ప్రకాష్ కరత్ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. 2015లో ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన సీపీఎం 21 మహాసభలో ప్రకాష్ కరత్ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఆ మహాసభలో సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు.
మయన్మార్ లో జననం
1948 ఫిబ్రవరి 7న నాటి బర్మా (మయన్మార్) లోని లేత్‌పదన్‌లో నాయర్ కుటుంబంలో ప్రకాష్ కరత్ జన్మించారు. ఆయన తండ్రి బర్మా రైల్వేస్‌లో క్లర్క్‌గా పని చేశారు. ప్రకాష్ కరత్ కుటుంబం కేరళలోని పాలక్కాడ్‌లోని ఎలప్పుజికి చెందినది. అక్కడే ఐదేళ్ల పాటు ఉన్న ప్రకాష్ కరత్, ఆ తరువాత బర్మాకు వెళ్లి తొమ్మిదేళ్ల వయస్సు వరకు తన కుటుంబంతో అక్కడే ఉన్నారు. కరత్ చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. పాఠశాల చదువు పూర్తి అయ్యాక, టోక్యో ఒలింపిక్స్‌పై అఖిల భారత వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఫలితంగా 1964లో టోక్యో ఒలింపిక్స్‌కు పది రోజుల పర్యటనకు వెళ్లారు. ఆయన చెన్నైలోని మద్రాసు క్రిస్టియన్ కాలేజీకి అర్థశాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా వెళ్లారు. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తమ ఆల్ రౌండ్ విద్యార్థిగా మెడల్‌ను గెలుచుకున్నారు.
ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీలో మాస్టర్స్
కాలేజీ ప్రొఫెసర్లలో ఒకరైన స్కాటిష్ వేదాంతవేత్త డంకన్ బి.ఫారరెస్టర్ ప్రకాష్ కరత్‌ను ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సహంతోనే రాజకీయాల్లో మాస్టర్స్ డిగ్రీ కోసం బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీలో స్కాలర్‌షిప్ పొందారు. 1970లో "ఆధునిక భారతదేశంలో భాష, రాజకీయాలు" అనే థీసిస్‌లో ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్‌సీ పట్టా పొందారు. ఎడిన్‌బర్గ్‌లో ఆయన విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ప్రసిద్ధ మార్క్సిస్ట్, చరిత్రకారుడు ప్రొఫెసర్ విక్టర్ కీర్నాన్‌ను కలిశారు. ప్రకాష్ కరత్ రాజకీయ కార్యాచరణ యూనివర్శిటీలో వర్ణ వివక్ష వ్యతిరేక నిరసనలతో ప్రారంభమైంది. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు.
జేఎన్యూ లో పీహెచ్డీ
1970లో భారత దేశానికి తిరిగి వచ్చిన ప్రకాష్ కరత్, న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో చేరారు. ఆయన పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు 1971 నుండి 1973 వరకు పార్లమెంట్‌లో సీపీఎం నేత, కేరళకు చెందిన లెజెండరీ కమ్యూనిస్టు నేత ఏకే గోపాలన్‌కు సహాయకుడిగా ఉన్నారు. జేఎన్‌యూలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) వ్యవస్థాపకుల్లో ప్రకాష్ కరత్ ఒకరు. ఆయన జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఎస్ఎఫ్ఐ అధ్యక్షత
1974-79 మధ్య ఎస్ఎఫ్ఐ రెండో సారి అధ్యక్షుడు అయ్యారు. ఈ కాలంలో ప్రకాష్ కరత్‌కు సహచరులు ఎన్.రామ్ (తరువాత ది హిందూ దినపత్రి చీఫ్ ఎడిటర్), మైథిలీ శిరామన్ ఉన్నారు. అలాగే పి. చిదంబరం కూడా ప్రకాష్ కరత్‌కు సన్నిహితంగా ఉండేవారు. పి. చిదంబరం తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి అయ్యారు. 1975-76లో దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఏడాదన్నర కాలంలో అజ్ఞాతవాసంలో ఉన్నారు. ప్రకాష్ కరత్ రెండు సార్లు అరెస్టు అయ్యారు. ఎనిమిది రోజులు జైలులో ఉన్నారు.