88ఏళ్ల పోప్​ ఫ్రాన్సిస్​ కన్నుమూత- ‘దేవుడి కోసం జీవితం అంకితం’-pope francis has died vatican says in video statement ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  88ఏళ్ల పోప్​ ఫ్రాన్సిస్​ కన్నుమూత- ‘దేవుడి కోసం జీవితం అంకితం’

88ఏళ్ల పోప్​ ఫ్రాన్సిస్​ కన్నుమూత- ‘దేవుడి కోసం జీవితం అంకితం’

Sharath Chitturi HT Telugu

పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం కన్నుమూసినట్లు వాటికన్ ఒక వీడియో ప్రకటనలో తెలిపింది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు.

పోప్​ ఫ్రాన్సిస్ (Reuters)

రోమన్ క్యాథలిక్ చర్చి తొలి లాటిన్ అమెరికన్ నేత పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని వాటికన్ సోమవారం ఒక వీడియో ప్రకటనలో తెలిపింది.

"ప్రియమైన సోదరులు, సోదరీమణులారా.. ఫాథర్​ ఫ్రాన్సిస్​ మరణించారన్న విషయాన్ని అత్యంత బాధతో ప్రకటిస్తున్నాను. ఈ రోజు ఉదయం 7:35 గంటలకు (0535 జిఎంటి) రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ ఫాథర్​ దగ్గరికి వెళ్లిపోయారు. చర్చ్​కి, దేవుడికి ఆయన తన జీవితం మొత్తాన్ని అంకితం చేశారు," అని వాటికన్ తన టెలిగ్రామ్ ఛానెల్​లో ప్రచురించిన ప్రకటనలో కార్డినల్ కెవిన్ ఫారెల్ వెల్లడించారు.

88 ఏళ్ల వయసున్న ఆయన, తన 12 ఏళ్ల పోప్​ బాధ్యతల మధ్యలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు.

పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం తన ఈస్టర్ సండే ప్రసంగంలో ఆలోచనా స్వేచ్ఛ, సహనానికి పిలుపునిచ్చారు.

బాసిలికా బాల్కనీ నుంచి 35,000 మందికి పైగా మంది జనసమూహానికి తన ఈస్టర్ శుభాకాంక్షలు ఇచ్చిన తరువాత, ఫ్రాన్సిస్ తన సాంప్రదాయ "ఉర్బి ఎట్ ఓర్బి" ("టు ది సిటీ అండ్​ ది వరల్డ్​") పఠనాన్ని ఒక సహచరుడికి అప్పగించాడు.

"మత స్వేచ్ఛ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇతరుల అభిప్రాయాలను గౌరవించకుండా శాంతి ఉండదు," అని ఆయన తన ప్రసంగం ద్వారా పేర్కొన్నారు. "ఆందోళనకరమైన" యూదు వ్యతిరేకతను, గాజాలో "నాటకీయ- విచారకరమైన" పరిస్థితిని ఆయన తన ప్రసంగం ద్వారా ఖండించారు.

పోప్​ ఫ్రాన్సిస్​ చాలా కాలంగా లంగ్​ ఇన్ఫెక్షన్​తో బాధపడ్డారు. న్యుమోనియాకు చికిత్స తీసుకున్న అనంతరం మార్చ్​ 23న డిశ్చార్జ్ అయ్యారు. శ్వాసలో మెరుగుదల ఉన్నప్పటికీ, ఆయన స్వరం బలహీనపడిపోయింది. అయినప్పటికీ ఆదివారం సహా ఇటీవలి మత ప్రదర్శనల్లో, ఆయన ఆక్సిజన్ పొందేంందుకు ఎలాంటి పైపులను ధరించలేదు.

2013లో పోప్​ అయినప్పటి నుంచి పవిత్ర ఈవెంట్స్​లలో ఫ్రాన్సిస్​ పాల్గొనకపోవడం ఈ ఏడాదే తొలిసారి. అనారోగ్య సమస్యల వల్ల కలొస్సియమ్​ దగ్గర శుక్రవారం జరిగిన స్టేషన్స్​ ఆఫ్​ ది క్రాస్​, శనివారం సెయింట్​ పీటర్స్​ బసిలికా వద్ద జరిగిన ఈస్టర్​ విజిల్​కి ఆయన హజరవ్వలేదు.

అర్జెంటీనాకు చెందిన ఫ్రాన్సిస్​.. పోప్​ బాధ్యతలు చేపట్టిన తొలి అమెరికన్​! 100ఏళ్లలో వాటికన్​లోని అధికారిక అపాస్టలిక్​ ప్యాలెస్​లో జీవించని తొలి పోప్​ కూడా ఈయనే.

2013లో ఎన్నికైనప్పటి నుంచి పోప్​ ఫ్రాన్సిస్​ సెలవులు తీసుకోలేదు. వయస్సు మీదపడుతున్నా శక్తికి మంచిన పనులు చేశారు. చాలా బిజీబిజీగా గడిపారు. పని ఒత్తిడిని తగ్గించుకోమని సూచించినా, ఆయన పోప్​గా అనేక బాధ్యతలను కొనసాగించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.