Quota for women in govt jobs: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు; రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
Quota for women in govt jobs: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక వరం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.
Quota for women in govt jobs: అటవీ శాఖ ను మినహాయించి మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లను కల్పించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేసింది.
చట్ట సవరణ
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘‘మధ్య ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1997’’ కు ప్రభుత్వం అవసరమైన సవరణలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. పోలీసు విభాగంలోని నియామకాల్లో కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయ పోస్ట్ ల్లో 50% మహిళలకు కేటాయిస్తున్నామన్నారు. మహిళలకు ప్రతీ నెల రూ. 1250 ఆర్థిక సహాయం అందించే లాడ్లీ బాహనా యోజన పథకాన్ని మధ్య ప్రదేశ్ ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ సంవత్సరం చివర్లో మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.