Modi remembers Mother:`అమ్మ జ్ఞాప‌కాల త‌డి..` ప్ర‌ధాని మోదీ ఉద్వేగ భ‌రిత పోస్ట్‌-pm writes blog dedicated to his mother on her birthday ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Modi Remembers Mother:`అమ్మ జ్ఞాప‌కాల త‌డి..` ప్ర‌ధాని మోదీ ఉద్వేగ భ‌రిత పోస్ట్‌

Modi remembers Mother:`అమ్మ జ్ఞాప‌కాల త‌డి..` ప్ర‌ధాని మోదీ ఉద్వేగ భ‌రిత పోస్ట్‌

HT Telugu Desk HT Telugu
Jun 18, 2022 02:49 PM IST

ఈ సంవత్సరం జూన్ 18న త‌న మాతృమూర్తి 100వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న చిన్న‌నాటి గుర్తుల‌ను, త‌ల్లి హీరాబెన్‌తో అనుబంధాన్ని, ఆమె వ్య‌క్తిత్వాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ్లాగ్ లో పంచుకున్నారు. ఆమె జీవితం, ఆమె త్యాగనిర‌తి త‌న వ్య‌క్తిత్వాన్ని తీర్చిదిద్దింద‌ని వివ‌రించారు. మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం సందర్భంగా.. హెచ్ టీ తెలుగు(HT Telugu) పాఠకుల కోసం మరోసారి ఆ వివరాలు..

త‌ల్లి హీరాబెన్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
త‌ల్లి హీరాబెన్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (ANI/ PIB)

త‌ల్లి 100వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్ 18న ఆమె ఉంటున్న గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌కు వ‌చ్చిన మోదీ.. త‌ల్లి పాదాలు క‌డిగి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఆ త‌రువాత‌, ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ సంద‌ర్భంగా త‌న చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను త‌న‌ బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకున్నారు.

నాన్న స్నేహితుడి కొడుకు కూడా మాతోనే..

`మా ప‌క్కఊరిలో మా నాన్న ప్రాణ స్నేహితుడు ఒక‌రు ఉండేవారు. ఆయ‌న అక‌స్మాత్తుగా చ‌నిపోయారు. దాంతో, ఆ ఫ్రెండ్ కొడుకును మా ఇంటికి తీసుకువ‌చ్చారు మా నాన్న‌. అత‌డి పేరు అబ్బాస్‌. అత‌డిని కూడా మా సొంత పిల్ల‌ల్లాగే చూసుకుంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం ఈద్ రోజు త‌న‌కు ఇష్ట‌మైన వంట‌కాలు చేసి పెట్టేది. చ‌దువు పూర్త‌య్యేవ‌ర‌కు అబ్బాస్ మా ఇంట్లోనే ఉన్నాడు` అని గుర్తు చేసుకున్నారు ప్ర‌ధాని. `అంతేకాదు, పండుగ రోజుల్లో మా ఇంటి దగ్గ‌ర్లోని పిల్ల‌లంతా మా ఇంట్లోనే ఉండేవారు. వారికి మా అమ్మ ర‌క‌ర‌కాల పిండివంట‌లు చేసిపెట్టేది` అని వివ‌రించారు.

చాలా పెద్ద మ‌న‌స్సు

`మా ఇల్లు చాలా చిన్న‌దే కానీ, మా అమ్మ మ‌న‌స్సు చాలా పెద్ద‌ద‌`ని ప్ర‌ధాని తెలిపారు. ఇత‌రుల‌కు ఇవ్వ‌డం, త‌ద్వారా పొందే ఆనందాన్ని గురించి త‌మ‌కు చిన్న వ‌య‌స్సులోనే వివ‌రించేద‌న్నారు. స్వార్థ‌ర‌హితంగా ఉండ‌డం, సేవాభావం క‌లిగి ఉండ‌డం, ఇత‌రుల క‌ష్టాల‌ను పంచుకోవ‌డం.. త‌న త‌ల్లి ద‌గ్గ‌ర నుంచి నేర్చుకున్నాన‌న్నారు.

సాధు సంతులు వ‌చ్చిన‌ప్పుడు..

మా ఊరికి ఎవ‌రైనా సాధు, సంతులు వ‌స్తే అమ్మ హీరాబెన్ వారిని సాద‌రంగా భోజ‌నానికి ఆహ్వానించేద‌ని ప్ర‌ధాని వివ‌రించారు. వారిని సంతుష్టుల‌ను చేసిన త‌రువాత‌, త‌న కోసం ఏమీ కోరేది కాద‌ని, పిల్ల‌ల‌ను ఆశీర్వదించాల‌ని మాత్ర‌మే కోరేద‌ని తెలిపారు. `ఈ పిల్ల‌ల‌ను ఆశీర్వ‌దించండి. ఇత‌రుల సంతోషంలో త‌మ ఆనందాన్ని వెతుక్కునేలా, ప్రేమ‌, సేవాభావం క‌లిగి ఉండేలా, ఇత‌రుల క‌ష్టాల్లో పాలు పంచుకునేలా వారిని ఆశీర్వ‌దించ‌మ‌ని ఆ సాధువుల‌ను కోరేది` అని ప్ర‌ధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

<p>త‌ల్లి హీరాబెన్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ప్ర‌ధాని మోదీ</p>
త‌ల్లి హీరాబెన్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ప్ర‌ధాని మోదీ (ANI)

ట్విట‌ర్ పోస్ట్‌

అమ్మ‌.. ఇది ఒక ప‌దం కాదు.. ప‌లు ఉద్వేగాల క‌ల‌యిక‌. ఈ రోజు, జూన్ 18 మా అమ్మ హీరాబెన్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె జ్ఞాప‌కాల‌ను పంచుకోవాల‌నుకుంటున్నాను` అని శనివారం ఉద‌యం మోదీ ట్వీట్ చేశారు. అంద‌రు అమ్మ‌ల్లాగానే త‌న త‌ల్లి అసాధార‌ణ స్త్రీ అని అభివ‌ర్ణించారు.

రెండు సార్లు మాత్ర‌మే..

త‌న త‌ల్లి హీరాబెన్ రెండు సంద‌ర్భాల్లో మాత్ర‌మే త‌న‌తో బ‌హిరంగ కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చింద‌ని మోదీ గుర్తు చేసుకున్నారు. `నేను ఏక్తా యాత్ర పూర్తిచేసుకుని, శ్రీన‌గ‌ర్‌లోని లాల్ చౌక్‌లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసి, తిరిగి వ‌చ్చిన త‌రువాత తొలిసారి అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన‌ ఒక ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లో నా నదుటిన కుంకుమ పెట్టి ఆశీర్వ‌దించింది` అని వివ‌రించారు. ఆ త‌రువాత‌, 2001లో గుజ‌రాత్ మొద‌టి సారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న‌ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి ఆశీర్వ‌దించింద‌న్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్