Surat- chennai highway: సూరత్-చెన్నై గ్రీన్‌ఫీల్డ్ రహదారులకు ప్రధాని శంకుస్థాపన-pm to visit karnataka maharastra today to inaugurate various developmental projects ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm To Visit Karnataka, Maharastra Today To Inaugurate Various Developmental Projects

Surat- chennai highway: సూరత్-చెన్నై గ్రీన్‌ఫీల్డ్ రహదారులకు ప్రధాని శంకుస్థాపన

HT Telugu Desk HT Telugu
Jan 19, 2023 08:38 AM IST

సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే ఆరు రాష్ట్రాల గుండా సాగుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గుండా ఈ హైవే సాగుతుంది.

ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (ANI / PIB)

న్యూఢిల్లీ: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఉదయం కర్ణాటకలోని యాదగిరి, కలబురగి జిల్లాల్లో పర్యటించి, యాదగిరి జిల్లాలోని కొడెకలో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవం చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నేషనల్ హైవే-150సీ పరిధిలోని 71 కి.మీ. భాగానికి, అలాగే 65.5 కి.మీ. పొడవైన మరో భాగానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్ మార్గంలో భాగం. రూ. 2,100 కోట్లు, రూ. 2,000 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.

సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే ఆరు రాష్ట్రాల గుండా సాగుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గుండా ఈ హైవే సాగుతుంది. ప్రస్తుత దూరం 1,600 కి.మీ. నుంచి 1,270 కి.మీ.లకు తగ్గుతుంది. ఈ మొత్తం రహదారి నిర్మాణం 2025 డిసెంబరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గుజరాత్, మహారాష్ట్రల్లోని సూరత్-నాసిక్-అహ్మద్ నగర్ మధ్య 290 కి.మీ. మేర గ్రీన్ ఫీల్డ్ రహదారి, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని అక్కల్‌కోట్-మహబూబ్ నగర్ సెక్షన్‌లో 230 కి.మీ. మేర గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా) హైవే నిర్మించనున్నారు.

అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన, తగినంత త్రాగునీటిని అందించే ప్రయత్నంలో జల్ జీవన్ మిషన్ కింద యాదగిరి జిల్లాలో తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం కింద 117 ఎంఎల్‌డి నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించనున్నారు. రూ. 2,050 కోట్లకు పైగా ఖర్చు చేసే ఈ ప్రాజెక్టు యాదగిరి జిల్లాలోని 700కు పైగా గ్రామీణ ఆవాసాలు, మూడు పట్టణాల్లోని దాదాపు 2.3 లక్షల ఇళ్లకు తాగునీరు అందించనుంది.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి నారాయ‌న్‌పూర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎక్స్‌టెన్ష‌న్ రెనోవేష‌న్ అండ్ మోడ‌ర‌న‌జేష‌న్ ప్రాజెక్ట్ (ఎన్‌ఎల్‌బిసి-ఇఆర్ఎమ్) ను కూడా ప్రారంభిస్తారు. 10,000 క్యూసెక్కుల కాలువ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 4.5 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించవచ్చు. కలబుర్గి, యాదగిరి, విజయపూర్‌ జిల్లాల్లోని 560 గ్రామాల్లోని మూడు లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 4,700 కోట్లు అని పీఎంవో ప్రకటనలో పేర్కొంది.

నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ (ఎన్‌ఎల్‌బిసి) ఆధునీకరణ మొత్తం దేశానికి నమూనాగా ఉంటుందని, నీటిపారుదల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను 100 శాతం గ్రామాలకు చేర్చాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా కలబురగి, యాదగిరి, రాయచూర్, బీదర్, విజయపురలోని ఐదు జిల్లాల్లో దాదాపు 1,475 నమోదు కాని ఆవాసాలను కొత్త రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించారు.

మధ్యాహ్నం కలబురగి జిల్లాలోని మల్ఖేడ్ గ్రామానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ కొత్తగా ప్రకటించిన ఈ రెవెన్యూ గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలను పంపిణీ చేస్తారు.

IPL_Entry_Point