PM foreign trips : రెండున్నరేళ్లల్లో 259కోట్లు- ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాల ఖర్చు ఇది..-pm narendra modis foreign trips from 2022 may to 2024 dec costed 259 crores government tells to parliament ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Foreign Trips : రెండున్నరేళ్లల్లో 259కోట్లు- ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాల ఖర్చు ఇది..

PM foreign trips : రెండున్నరేళ్లల్లో 259కోట్లు- ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాల ఖర్చు ఇది..

Sharath Chitturi HT Telugu

PM Modi foreign trips : గత కొన్నేళ్లల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక విదేశీ పర్యటనలు చేపట్టారు. కాగా 2022 మే నుంచి 2024 డిసెంబర్​ వరకు మోదీ చేపట్టిన విదేశీ పర్యటనలకు రూ. 259 కోట్లు ఖర్చు అయినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ

ద్వైపాక్షిక సమావేశాలు, బహుపాక్షిక కార్యక్రమాల కోసం 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 38 విదేశీ పర్యటనలకు మొత్తం రూ.259 కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వం పార్లమెంటులో అందించిన గణాంకాలు చెబుతున్నాయి. వసతి, వేదిక ఛార్జీలు, భద్రత, రవాణా, ఇతరత్రా ఖర్చులు అనే ఐదు పద్దుల కింద ఖర్చులు జరిగాయని, మొత్తం రూ.104 కోట్లు ఖర్చయిందని, ఇది మొత్తం ఖర్చులో సగం కంటే తక్కువని పేర్కొంది. ఆ తర్వాత ఇతరత్రా ఖర్చులు (రూ.75.7 కోట్లు), రవాణా (రూ.71.1 కోట్లు) ఉన్నాయని వివరించింది.

మోదీ విదేశీ ప్రయాణాల ఖర్చులు..

రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అధికారిక, సహాయక, భద్రత, మీడియా ప్రతినిధుల కోసం చేసిన ఖర్చును ఈ గణాంకాల్లో పొందుపరిచినట్లు తెలిపింది.

వ్యక్తిగత దేశాల విషయానికొస్తే అత్యధికంగా అమెరికా (రూ.38.2 కోట్లు), జపాన్ (రూ.33 కోట్లు), జర్మనీ (రూ.23.9 కోట్లు), రష్యా (రూ.16.1 కోట్లు), ఫ్రాన్స్ (రూ.15.7 కోట్లు), ఇటలీ (రూ.14.4 కోట్లు), యూఏఈ (రూ.12.7 కోట్లు) పర్యటనలకు ఖర్చు చేశారు.

2023 జూన్​లో మోదీ అమెరికా పర్యటనకు రూ.22.89 కోట్లు ఖర్చు అవ్వగా, 2022 మేలో నేపాల్ పర్యటనకు రూ.80.01 లక్షలు అయ్యింది.

ప్రధానమంత్రి మొత్తం 38 పర్యటనలు చేయగా, ఆయన 34 దేశాలను సందర్శించారు (కొన్ని దేశాలలో ఒకటి కంటే ఎక్కువ పర్యటనలు చేశారు). 2022లో 8, 2023లో 10, 2024లో 16 దేశాల్లో పర్యటించారు.

2022లో 10 సందర్శనలు జరిగాయి. సంవత్సరానికి సగటు సందర్శన ఖర్చు రూ .5.6 కోట్లు! 2023లో 11 సందర్శనలు జరిగాయి. సంవత్సరానికి సగటు సందర్శన ఖర్చు రూ .8.5 కోట్లు! 2024లో విదేశీ సందర్శనల సంఖ్య 17కు పెరిగింది. సంవత్సరానికి సగటు సందర్శన ఖర్చు రూ .6.4 కోట్లు!

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన కొన్ని విదేశీ పర్యటనల ఖర్చును సైతం మార్గరిటా తన సమాధానంలో పొందుపరిచారు. ఇందులో 2011లో అమెరికా పర్యటనకు రూ.10.74 కోట్లు, 2013లో రష్యా పర్యటనకు రూ.9.95 కోట్లు, 2011లో ఫ్రాన్స్ పర్యటనకు రూ.8.33 కోట్లు, 2013లో జర్మనీ పర్యటనకు రూ.6.02 కోట్లు ఖర్చైనట్టు వివరించారు.

ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గులకు సర్దుబాటు చేసుకోకుండా వాస్తవ వ్యయాన్ని ఈ గణాంకాలు చూపిస్తున్నాయని విదేశాంగ సహాయ మంత్రి వెల్లడించారు.

2022లో ప్రధాని పర్యటించిన దేశాల్లో జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, నేపాల్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఉజ్బెకిస్థాన్, ఇండోనేషియా ఉన్నాయి.

2023లో పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, ఈజిప్ట్, ఫ్రాన్స్, యూఏఈ, దక్షిణాఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా దేశాల్లో పర్యటించారు. 2024లో ప్రధాని యూఏఈ, ఖతార్, భూటాన్, ఇటలీ, ఆస్ట్రియా, రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, బ్రూనై దారుస్సలాం, అమెరికా, సింగపూర్, లావోస్, నైజీరియా, బ్రెజిల్, గయానా, కువైట్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు.

2016లో కొనుగోలు చేసిన రెండు బోయింగ్ 777-300 ఈఆర్​లను ఉపయోగించి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక స్క్వాడ్రన్ నడుపుతున్న ఎయిరిండియా వన్ అనే ప్రత్యేక విమానంలో ప్రధాని విదేశాలకు వెళ్లారు. ప్రధాని వెంట ప్రధాని కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్​నకు చెందిన భద్రతా విభాగం ఉంటారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.