Narendra Modi | గ్లోబల్‌ లీడర్ల లిస్ట్‌లో మళ్లీ మోదీయే టాప్‌.. ఆయన రేటింగ్ ఇదీ!-pm narendra modi tops again in global leaders approval ratings list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Narendra Modi | గ్లోబల్‌ లీడర్ల లిస్ట్‌లో మళ్లీ మోదీయే టాప్‌.. ఆయన రేటింగ్ ఇదీ!

Narendra Modi | గ్లోబల్‌ లీడర్ల లిస్ట్‌లో మళ్లీ మోదీయే టాప్‌.. ఆయన రేటింగ్ ఇదీ!

Hari Prasad S HT Telugu
Feb 07, 2022 08:16 AM IST

వరుసగా మూడో ఏడాదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఈ గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌ లిస్ట్‌లో టాప్‌లో ఉండటం విశేషం. తాజా జాబితాలో మొత్తం 13 మంది ప్రపంచ నేతల ర్యాంకులను వెల్లడించింది అమెరికా రీసెర్చ్‌ సంస్థ మార్నింగ్‌ కన్సల్ట్‌.

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో) (Reuters )

న్యూయార్క్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని తాజా సర్వే మరోసారి తేల్చింది. ప్రతి ఏటా విడుదలయ్యే గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌ రేటింగ్‌ లిస్ట్‌లో ఈసారి కూడా మోదీయే టాప్‌లో ఉన్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌లను వెనక్కి నెట్టారు. ఈ తాజా లిస్ట్‌ను అమెరికా రీసెర్చ్‌ సంస్థ మార్నింగ్‌ కన్సల్ట్‌ రిలీజ్‌ చేసింది.

మోదీకి 72 శాతం రేటింగ్‌

ఈ లిస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 72 శాతం రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఓబ్రడార్‌ 64 శాతంతో రెండోస్థానంలో ఉన్నారు. ఇక 57 శాతంతో ఇటలీ ప్రధాని మారియో డ్రాగి మూడోస్థానంలో, 47 శాతంతో జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా నాలుగోస్థానంలో, 42 శాతంతో జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ ఐదోస్థానంలో ఉన్నారు. 

ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, సౌత్‌ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, కెనడా పీఎం జస్టిన్‌ ట్రూడో 41 శాతం రేటింగ్స్ సాధించారు. ఈ లిస్ట్‌లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అందరి కంటే కింద ఉన్నారు.

అత్యధిక రేటింగ్‌తో ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉండటం ప్రధాని నరేంద్ర మోదీకి ఇది వరుసగా మూడో ఏడాది కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని ఆయా దేశాల్లో పరిస్థితులకు సంబంధించిన డేటాను ఈ సంస్థ అందజేస్తుంది. ప్రతి దేశంలో వయసు, లింగం, ప్రాంతం ఆధారంగా సర్వేలు నిర్వహిస్తారు.