ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు భారత సాయుధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలతో పాటు ప్రతి దేశ పౌరుడిని ప్రధాని మోదీ అభినందించారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు మన దేశంలోని తల్లులు, సోదరీమణుల కుంకుమను తుడి చేశారని, అందుకే వారి ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారత సైన్యం పెద్ద ఎత్తున ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.
ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా దెబ్బకొట్టామని చెప్పారు మోదీ. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ చేశారు. భారత్ చర్యలకు పాకిస్థాన్ భయపడిందని ప్రధాని మోదీ అన్నారు. కాల్పుల విరమణకు ప్రపంచాన్ని వేడుకుందన్నారు.
'గత కొన్ని రోజులుగా దేశ బలం, సంయమనం రెండింటినీ మనందరం చూశాం. ప్రతి భారతీయుడి తరఫున భారతదేశ సాయుధ దళాలకు, మన నిఘా సంస్థలకు, మన శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నా. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు ప్రదర్శించిన అనాగరికత దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసింది. విహారయాత్రకు వెళ్లిన అమాయక పౌరులను వారి కుటుంబాలు, పిల్లల ముందే మతం ప్రాతిపదికన దారుణంగా హతమార్చారు.' అని మోదీ అన్నారు.
ఇది దేశ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే హేయమైన ప్రయత్నమని, ఈ బాధ వ్యక్తిగతంగా తనకు చాలా పెద్దదని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ఉగ్రదాడి తర్వాత యావత్ దేశం, ప్రతి రాజకీయ పార్టీ ఒకే గొంతుకతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిందన్నారు. ఉగ్రవాదులను నేలమట్టం చేసేందుకు భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని గుర్తుచేశారు. మన సోదరీమణులు, కూతుళ్ల నుదుటిపై నుంచి కుంకుమను తొలగించడం వల్ల కలిగే ఫలితం ఏంటో నేడు ప్రతి ఉగ్రవాదికి, ప్రతి ఉగ్రవాద సంస్థకు తెలుసు అని పేర్కొన్నారు.
భారత్ చేసిన ఈ చర్యతో పాకిస్థాన్ తీవ్ర నిరాశకు గురైందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీంతో అవాక్కైన పాక్ ఈ ఆవేశంలో మరో దుస్సాహసానికి పాల్పడిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ చర్యకు మద్దతు ఇవ్వడానికి బదులుగా పాకిస్థాన్ భారతదేశంపై దాడి చేయడం ప్రారంభించిందని గుర్తు చేశారు. మన స్కూళ్లు, కాలేజీలు, గురుద్వారాలు, దేవాలయాలు, సాధారణ పౌరుల ఇళ్లను పాక్ లక్ష్యంగా చేసుకుందన్నారు. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు భారత్ ముందు ఎలా ఛిద్రమయ్యాయో ప్రపంచం చూసిందన్నారు. భారత బలమైన గగనతల రక్షణ వ్యవస్థ వాటిని ఆకాశంలో నాశనం చేసిందన్నారు. సరిహద్దుల్లో దాడికి పాక్ సన్నాహాలు చేసినా భారత్ మాత్రం పాక్ ఛాతీపై కొట్టిందన్నారు.
భారత్ దాడుల నుంచి ఉగ్రవాదులు కోలుకునే అవకాశం కూడా లభించలేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ క్షిపణులు, డ్రోన్లు పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు ఉగ్రవాద సంస్థల భవనాలే కాకుండా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతిందన్నారు.