Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేసింది. ఆ ప్రసంగం ఆద్యంతం స్వోత్కర్ష.. పరనిందలతో సాగిందని ఎద్దేవా చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఎన్నికల ప్రచార ప్రసంగంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ప్రసంగం మొత్తం అబద్ధాలు, అతిశయోక్తులతో, స్వోత్కర్షలతో నిండిపోయిందన్నారు. ప్రధాని మోదీ ప్రసంగమంతా తనను తాను పొగడుకోవడమే సరిపోయిందన్నారు. సాధారణంగా ఎర్ర కోట పై నుంచి ప్రధానమంత్రి చేసే ప్రసంగం.. దేశం సాధించిన ప్రగతి, పాలనలో చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించేలా ఉండాలి కానీ, ప్రధాని మోదీ ప్రసంగం మాత్రం పూర్తిగా ఎన్నికల ప్రసంగంలాగా స్వీయ ప్రశంసలతో ఉందన్నారు. ఆ ప్రసంగంలో దాదాపు అన్నీ అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయన్నారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో.. మణిపూర్ సమస్యను పూర్తి స్థాయిలో ప్రస్తావించలేదని జైరాం రమేశ్ విమర్శించారు. గత మూడు నెలలుగా వర్గ పోరుతో మణిపూర్ అట్టుడుకుతుంటే, పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతుంటే, హింసతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే.. ప్రధాని ఆ సమస్యను నామమాత్రంగా ప్రస్తావించారని జైరాం రమేశ్ మండిపడ్డారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.
కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని రమేశ్ విమర్శించారు. నిజానికి కోవిడ్ పై పోరు విషయంలో ప్రభుత్వం విఫలమైందని, సరైన సమయానికి టీకాలను సప్లై చేయలేకపోయిందని, ఆసుపత్రులకు అవసరమైన ఆక్సీజన్ ను అందించలేకపోయిందని మండిపడ్డారు. దాంతో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లో కోవిడ్ తో 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని జైరాం రమేశ్ గుర్తు చేశారు.
టాపిక్