భారత్ మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ అంగీకరించదు.. పాక్‌తో ఒప్పందంపై ట్రంప్‌కు మోదీ క్లారిటీ!-pm modi phone conversation with us president trump and respond on operation sindoor india pakistan ceasefire mediation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్ మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ అంగీకరించదు.. పాక్‌తో ఒప్పందంపై ట్రంప్‌కు మోదీ క్లారిటీ!

భారత్ మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ అంగీకరించదు.. పాక్‌తో ఒప్పందంపై ట్రంప్‌కు మోదీ క్లారిటీ!

Anand Sai HT Telugu

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ వాదనను తోసిపుచ్చారు ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ (Narendra Modi - X)

భారత్-పాక్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. జీ7 శిఖరాగ్ర సదస్సు ముగియడానికి ముందు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ కాల్పుల విరమణకు వాణిజ్యం వంటి అంశాల ప్రస్తావన లేదని ప్రధాని ట్రంప్‌కు స్పష్టం చేశారు.

మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు

మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన సంభాషణ గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు. జీ-7 సదస్సు మధ్య ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉండేది. అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో ట్రంప్ అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు బుధవారం ఫోన్‌లో మాట్లాడారు.

ఆపరేషన్ సిందూర్‌పై

ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య సుమారు 35 నిమిషాల పాటు సంభాషణ సాగింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ట్రంప్ సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలన్న తన సంకల్పాన్ని భారత్ ప్రపంచానికి తెలియజేసిందని ట్రంప్‌కు ప్రధాని చెప్పారు. భారత్.. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని అన్నారు.

చర్చలతోనే కాల్పుల విరమణ

భారత్ ఇకపై ఉగ్రవాదాన్ని పరోక్ష యుద్ధంగా చూడదని, యుద్ధంగా చూస్తోందని, భారత్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత నెలలో పాకిస్తాన్ చేసిన పిరికిపంద దాడుల తరువాత, భారతదేశం ధీటైన సమాధానం ఇచ్చిందని, ఆ తర్వాత సైనిక చర్యను ఆపమని పాకిస్థాన్ భారతదేశాన్ని వేడుకోవాల్సి వచ్చిందని ట్రంప్‌కు ఫోన్ సంభాషణలో చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం లేదా భారత్-పాకిస్థాన్‌ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం గురించి ఏ స్థాయిలోనూ చర్చించలేదని ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్‌నకు స్పష్టంగా చెప్పారు. కాల్పుల విరమణ కోసం భారత్, పాక్ ల మధ్య రెండు సైన్యాల ద్వారా చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వానికి భారత్ ఎన్నడూ అంగీకరించలేదని, మధ్యవర్తిత్వాన్ని ఎప్పటికీ అంగీకరించదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.