ప్రధాని నరేంద్ర మోడీ తన లోక్ సభ నియోజకవర్గం వారణాసి నుంచి పాకిస్థాన్‌కు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి ఉగ్రదాడికి పాక్ కుట్ర పన్నితే యూపీకి చెందిన బ్రహ్మోస్ క్షిపణి దాన్ని ధ్వంసం చేస్తుందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. 'ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన ఆయుధాల సత్తాను ప్రపంచం మొత్తం చూసింది. మన గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు భారత్ బలాన్ని నిరూపించాయి. బ్రహ్మోస్ పేరు వింటే పాక్ కు నిద్రలేకుండా పోతుంది.' అని ప్రధాని మోదీ అన్నారు.
బ్రహ్మోస్ క్షిపణులు యూపీలోనూ తయారవడం సంతోషంగా ఉందన్నారు మోదీ. పలు బడా కంపెనీలు కూడా యూపీ డిఫెన్స్ కారిడార్ లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో యూపీలో తయారైన ఆయుధాలు భారత సైన్యానికి బలంగా మారనున్నాయన్నారు. ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు.
'పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది కోసం నా హృదయం శోకసంద్రంలో మునిగిపోయింది. మహదేవ్ ఆశీస్సులతో ఆడబిడ్డల సింధూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇచ్చిన హామీ నెరవేరింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రపంచం భారత్ ను చూసింది. మన దేశంలోనే కొందరు దీనిపై కలత చెందారు.' అని ప్రధాని ఆరోపించారు.
ఆపరేషన్ సింధూర్ గురించి మీకు గర్వం లేదా కొన్ని పార్టీలను మోదీ సూటిగా ప్రశ్నించారు. మన డ్రోన్లు, క్షిపణులు కచ్చితమైన దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను ఎలా ధ్వంసం చేశాయో మీరంతా చూసి ఉంటారన్నారు. సాయుధ దళాల శౌర్యాన్ని కాంగ్రెస్ పదేపదే అవమానిస్తోందని, ఆపరేషన్ సింధూర్‌ను జోక్‌గా చూస్తున్నారని మోదీ మండిపడ్డారు. సమాజ్ వాదీ పార్టీపైనా మోడీ విమర్శలు గుప్పించారు.
ఇక భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొందన్నారు. అన్ని దేశాలు తమ సొంత ప్రయోజనాల మీద దృష్టి పెడుతున్నాయన్నారు. భారత్ కూడా అతిత్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారవుతుందన్నారు. మన ఆర్థిక ప్రయోజనాల మీద మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలు పక్కనపెట్టి.. స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుంబిగించాలన్నారు. కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు.