Mallikarjun Kharge assassination : 'కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హత్యకు బీజేపీ నేత కుట్ర!'
Mallikarjun Kharge assassination : తమ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. కర్ణాటక బీజేపీ నేత, ఛిత్తాపూర్ నియోజకవర్గం అభ్యర్థి మణికంఠ రాథోడ్.. ఖర్గేతో పాటు ఆయన కుటుంబసభ్యులను హత్య చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని పేర్కొంది.
Mallikarjun Kharge assassination : మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది! తమ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆయన కుటుంబసభ్యులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంది. ఓ బీజేపీ నేత.. ఖర్గేను చంపేందుకు ప్లాన్ వేస్తున్నారంటూ.. ఓ ఆడియో టేప్‌ను విడుదల చేసింది.
ఆడియో టేప్‌లో ఏముంది..?
సంబంధిత బీజేపీ నేత, ఛిత్తాపూర్ నియోజకవర్గం అభ్యర్థి మణికంఠ రాథోడ్.. ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నట్టు ఆ ఆడియో టేప్‌లో ఉంది.
Manikanta Rathod BJP : "మల్లిఖార్జున ఖర్గే, ఆయన భార్య, పిల్లలను చంపేందుకు ప్లాన్ వేస్తున్నారు. దీనిని చిన్న విషయంగా చూడకూడదు. ఖర్గే సాధారణ మనిషి కాదు. ఛిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి గురించి నాకు, ప్రధాని మోదీ, సీఎం బసవరాజ్ బొమ్మై కన్నా మీకే (కర్ణాటక ప్రజలు) ఎక్కువ తెలసు. ఈ విషయంపై ప్రధాని మౌనంగానే ఉంటారు. కర్ణాటక పోలీసులు, ఎన్నికల సంఘం కూడా నిశ్శబ్దంగానే ఉంటాయి. కానీ కర్ణాటక ప్రజలు మౌనంగా ఉండరు. సరైన సమాధానం ఇస్తారు," అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
ఖర్గే హత్యకు జరుగుతున్న కుట్రపై బీజేపీ నేత మాట్లాడుతున్న టేప్ తమకు లభించిందని సుర్జేవాలా తెలిపారు. ఇది దిగజారుడు రాజకీయాలని మండిపడ్డారు. "ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాభవం తప్పదని తెలుసుకున్న బీజేపీ.. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ఆయన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఛిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మాటల్లో ఇది స్పష్టమవుతోంది. ఇది కర్ణాటక బిడ్డ, కర్ణాటక మట్టికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్య," అని మండిపడ్డారు సుర్జేవాలా.
మణికంఠ రాథోడ్ వర్సెస్ ప్రియాంక ఖర్గే..
Manikanta Rathod vs Priyank Kharge : మణికంఠ రాథోడ్‌పై ఇప్పటికే 30కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈయన్ని కలబురగి ప్రాంతం నుంచి ఏడాది పాటు బహిష్కరించారు కూడా. మల్లిఖార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేను చంపేస్తానని బెదిరించినందుకు.. గతేడాది నవంబర్ 13న రాథోడ్ అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేప్‌ను వెరిఫై చేయడం కష్టంగా మారింది.
ప్రస్తుతం.. ఛిత్తాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై బరిలో దిగుతున్నారు రాథోడ్. ప్రియాంక్ ఖర్గే.. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.
Karnataka elections 2023 : 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇంకొన్ని మాత్రం.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సూచిస్తున్నాయి.
సంబంధిత కథనం