Nepal plane crash : నేపాల్‌లో నేలకూలిన విమానం.. 68మంది దుర్మరణం!
Nepal plane crash : నేపాల్‌లో ఓ విమానం నేలకూలింది. ఆ సమయంలో విమానంలో 72మంది ఉన్నారు. ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు సమాచారం.
Nepal plane crash : నేపాల్‌లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పశ్చిమ నేపాల్‌లోని పోఖారా నగరంలో పాత-నూతన అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్యలో ఓ విమానం ఆదివారం ఉదయం నేలకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‍పీ రిపోర్ట్ చేసింది. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది.

అసలేం జరిగింది…?
నేలకూలిన విమానం దేశీయ విమానయాన సంస్థ యెటీ ఎయిర్‌లైన్స్‌కి చెందినది. నేపాల్ రాజధాని కాట్మాండూ నుంచి పోఖారాకు వస్తున్న నేపథ్యంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఏటీఆర్ 72 ఎయిర్‌క్రాఫ్ట్‌లో.. 68మంది ప్రయాణికులతో పాటు మొత్తం మీద 72మంది ఉన్నారు. ఈ ఘటనలో ప్రణాలతో మిగిలి ఉండటం కష్టమే అని తెలుస్తోంది.
Nepal plane crash today : ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసే పనిలోపడ్డారు.
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ ప్రకారం.. ఆదివారం ఉదయం 10:33 గంటలకు కాట్మాండూ నుంచి ఈ ఏటీఆర్ 72 ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరింది. 25 నిమిషాల తర్వాత గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత.. పోఖారా విమానాశ్రయానికి సమీపంలోని సేతీ నది ఒడ్డున విమానం కుప్పకూలింది. ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో 5 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటామని ప్రయాణికులు భావిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.
Yeti airlines plane crash : నేలకూలిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. స్థానిక యంత్రాంగం.. మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తోంది. మంటల కారణంగా సహాయక చర్యలు మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ.. అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. ఘటనపై ప్రాథమిక నివేదికను సత్వరమే అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ప్రమాదాల అడ్డా.. నేపాల్!
Yeti airlines pokhara plane crash : 'నేపాల్‌లో విమాన ప్రయాణాలు చేయడం అంటే.. ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నట్టే!' అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తయారయ్యాయి. విమాన సేవలు అత్యంత దారుణంగా ఉన్న దేశాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రతియేటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
2022 మేలో జరిగిన ఓ ప్రమాదంలో 22మంది ప్రాణాలు కోల్పోయారు. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం.. ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో 16మంది నేపాలీలు, నలుగురు భారీతుయుల, ఇద్దరు జర్మన్వాసులు ఉన్నారు.
సంబంధిత కథనం