Suicide in IIT Kanpur: ఐఐటీ కాన్పూర్ లో మరో ఆత్మహత్య; గత 5 వారాల్లో మూడో ఘటన
Suicide in IIT Kanpur: ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ కాన్పూర్ లో వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Suicide in IIT Kanpur: ఉత్తర ప్రదేశ్ లో ఉన్న కాన్పూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ కాన్పూర్)లో పీహెచ్ డీ చేస్తున్న ఒక విద్యార్థిని గురువారం క్యాంపస్ లోని తన హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఉరి వేసుకుని..
జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని డాక్టరేట్ కోసం 20 రోజుల క్రితమే ఈ ఇన్ స్టిట్యూట్ లో చేరింది. ఆ విద్యార్థిని తండ్రి హాస్టల్ మేనేజర్ కు ఫోన్ చేసి బుధవారం నుంచి ఆమె ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు. దాంతో, ఆమె గది వద్దకు చేరుకున్న హాస్టల్ సిబ్బంది.. ఆ గది లోపలి నుంచి గడియ పెట్టి ఉందని గుర్తించారు. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా, ఆమె సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది.
పోలీసులకు సమాచారం
కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్ డీ చేస్తున్న ఓ విద్యార్థిని మృతి చెందినట్లు ఐఐటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) అభిషేక్ పాండే గురువారం తెలిపారు. సమాచారం తెలియగానే, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఇన్ స్టిట్యూట్ కు చేరుకుందని తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.
మూడో ఘటన
గత ఐదు వారాల్లో క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్న మూడో విద్యార్థిని ఆమె. బయోసైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగంలో చేరిన ఓ రీసెర్చ్ స్కాలర్ కూడా ఈ సంస్థలో చేరిన వారం రోజులకే డిసెంబర్ 12న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో మాస్టర్స్ కోర్సులో చేరిన మీరట్ కు చెందిన మరో విద్యార్థి ఈ నెల 10న హాస్టల్ గదిలో శవమై కనిపించాడు.