H-1B Visa: హెచ్-1బీ వీసా ఉన్న వారి భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేయొచ్చు: కోర్టు తీర్పు
H-1B Visa: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేయవచ్చని యూఎస్‍లోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ టెక్కీలకు ఊరట కల్పించింది.
H-1B Visa: అమెరికాలో టెక్ రంగంలో పని చేస్తున్న భారత్ సహా విదేశీ ఉద్యోగులకు ఊరట లభించింది. హెచ్1-బీ వీసాహోల్డర్ల భాగస్వాములు (భర్త లేదా భార్య).. అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని ఓ యూఎస్ కోర్టు తీర్పు చెప్పింది. కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఎంప్లాయ్‍మెంట్ ఆథరైజేషన్ కార్డులను జారీ చేసేలా ఒబామా హయాంలో నిబంధన వచ్చింది. అయితే దీన్ని రద్దు చేయాలంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే ఫౌండేషన్ అమెరికాలోని ఓ జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని ఆ కోర్టు కొట్టేసింది. హెచ్-1బీ వీసాదారుల పార్ట్‌నర్స్ ఉద్యోగాలు చేయవచ్చని స్పష్టం చేసింది.
భారతీయులకు ఊరట
H-1B Visa: ఇండియా నుంచి హెచ్1-బీ వీసా ద్వారా అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఇది ఊరట కలిగించే విషయం. ఈ తాజా తీర్పుతో హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేయవచ్చనే నిబంధన కొనసాగనుంది.
H-1B Visa: ఈ దాఖలైన పిటిషన్‍ను అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్1-బీ వర్కర్లకు చెందిన భాగస్వాములకు లక్ష మందికిపైగా అమెరికా.. వర్క్ ఆథరైజేషన్‍ను అందించింది. ఇందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.
H-1B Visa: అమెరికా చట్టసభలు కూడా హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేసుకునేలా అనుమతి ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నాయని జడ్జి చుట్కన్ చెప్పారు. సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‍ను కొట్టేశారు.
H-1B Visa: ఈ తీర్పు పట్ల ఇమ్మిగ్రెంట్ రైట్స్ అడ్వొకేట్ అజయ్ భుటోరియా హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీ కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. “హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు పని చేసేందుకు అనుమతి కల్పిస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం, వేలాది కుటుంబాలకు ఊరట కలిగిస్తుంది. ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్న ఫ్యామిలీలకు ఇది ఉపకరిస్తుంది. కలిసి ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తుంది” అని ఆయన అన్నారు.
అయితే, ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ నిర్ణయించుకుంది.
సంబంధిత కథనం