Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలు.. ఉపరాష్ట్రపతికి ప్రధాని మోదీ స్వాగతం
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. కీలక బిల్లులు ఈ సెషన్‍లో ఉభయ సభల ముందుకు రానున్నాయి. రాజ్యసభ చైర్మన్‍గా జగ్‍దీప్ ధన్‍కర్ కు స్వాగతం పలుకుతూ ప్రసంగించారు మోదీ.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం (డిసెంబర్ 7న) మొదలయ్యాయి. లోక్‍సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభయ్యాయి. రాజ్యసభ చైర్మన్ పీఠాన్ని తొలిసారి అధిష్టించిన ఉపరాష్ట్రపతి జగ్‍దీప్ ధన్‍కర్ (Jagdeep Dhankhar) కు స్వాగతం పలికారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). ఈ మేరకు రాజ్యసభలో ప్రారంభ ప్రసంగం చేశారు.
'స్ఫూర్తిదాయకం'
Parliament Winter Session: “సభతో పాటు దేశం మొత్తం తరఫున నేను చైర్మన్‍కు అభినందనలు తెలుపుతున్నా. ఎన్నో కష్టాలను అధిగమించి మీరు (జగ్‍దీప్ ధన్‍కర్) ఈ స్థానానికి చేరుకున్నారు. దేశంలోని చాలా మందికి ఇది ఎంతో స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ అన్నారు. ఉపరాష్ట్రపతి జగ్‍దీప్ ధన్‍కర్.. తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానాన్ని అధిష్టించారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ఇవే. అలాగే, జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్‍కు రావడం గొప్ప అవకాశమని, దేశానికి అమృతకాలం మొదలైందని మోదీ వ్యాఖ్యానించారు.
17 పనిదినాలు.. 16 బిల్లులు
Parliament Winter Session: ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 17 పని దినాలు ఉంటాయి. ఈ సెషన్‍లో 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. నేటి నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు ఈ శీతాకాలం సమావేశాలు జరగనున్నాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ ఏడాది నెల ఆలస్యంగా ఈ సెషన్ జరుగుతోంది.
గత సమావేశాల తర్వాతి నుంచి ఈ సెషన్ మధ్యకాలంలో మరణించిన ఎంపీలకు లోక్‍సభ నివాళులు అర్పించనుంది. అలాగే తొలి రోజే కొన్ని బిల్లు సభల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
యువ ఎంపీలకు అవకాశం ఇవ్వాలి: మోదీ
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. సభలు తరచూ వాయిదాలు పడటం మంచిది కాదని కొందరు ప్రతిపక్ష ఎంపీలు కూడా తనతో అన్నారని మోదీ చెప్పారు. సమావేశాలకు ఆటంకం ఏర్పడితే యువ ఎంపీలు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్టవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.
“చర్చల్లో మాట్లాడేందుకు తొలిసారి ఎంపికైన ఎంపీలకు అవకాశాలను ఇవ్వాలని నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా. తదుపరి తరం ప్రజాస్వామ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది చాలా అవసరం” అని మోదీ చెప్పారు.
వచ్చే ఏడాది జీ20 సదస్సును నిర్వహించే మన దేశానికి అవకాశం రావడం అద్భుతమైన అవకాశమని మోదీ అన్నారు. దేశ సమర్థతను ప్రపంచానికి చాటి చాటి చెప్పే మరో అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు.