Parliament Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఇదే..
Parliament Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Parliament Session: సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎజెండా తెలియజేయకుండా, సమావేశాలు నిర్వహించడమేంటని ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ప్రత్యేక సమావేశాల ఎజెండాను ప్రభుత్వం వెల్లడించింది.
75 ఏళ్ల ప్రస్థానం
ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భారత పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక చర్చ జరగనుంది. సమావేశాల తొలి రోజు భారత పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. భారత పార్లమెంటు తొలి సమావేశం డిసెంబర్ 9, 1946 లో జరిగింది. సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 17వ తేదీన పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో అఖిల పక్ష భేటీని నిర్వహిస్తున్నారు.
ఎలక్షన్ కమిషనర్ల విధి విధానాలపై..
అలాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఇతర ఎలక్షన్ కమిషనర్లను రెగ్యులేట్ చేయడానికి ఉద్దేశించిన ఒక బిల్లు సహా మొత్తం 4 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక, విధులు, సర్వీస్ నిబంధనలు.. మొదలైన వాటిని నియంత్రించే దిశగా రూపొందించిన బిల్లుపై ఈ సమావేశాల్లోనే చర్చ జరగనుంది. ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి, లోక్ సభ లో విపక్ష నేత, ప్రధాని ప్రతిపాదించిన కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన అందులో ఉంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. ఈ బిల్లుతో పాటు ఈ ప్రత్యేక సమావేశాల్లో అడ్వకేట్స్ చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన న్యాయవాదుల (సవరణ) బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ స్థానంలో తీసుకురానున్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈరెండు బిల్లులు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందాయి. అదనంగా, పోస్ట్ ఆఫీస్ బిల్లుపై కూడా లోక్ సభలో చర్చ జరగనుంది.