Pariksha Pe Charcha : ఈసారి ప్రకృతి మధ్యలో ‘పరీక్షా పే చర్చా’- విద్యార్థులకు మోదీ కీలక సూచనలు..
Pariksha Pe Charcha 2025 : పరీక్షా పే చర్చా 2025 సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడారు. వారికి కీలక సూచనలు ఇచ్చారు.
ప్రతియేటా పరీక్షల సీజన్‌కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను కలుస్తారన్న విషయం తెలిసిందే. దీనిని ‘పరీక్షా పే చర్చా’ అని పిలుస్తారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 10, మంగళవారం విద్యార్థులతో ఈ ముఖాముఖిని నిర్వహించారు మోదీ. సాధారణంగా పెద్ద హాల్లో జరిగే ఈ ఈవెంట్, ఈసారి దిల్లీ భారత మండంపం ప్రాంగణంలో ప్రకృతి మధ్య జరిగింది. అంతేకాదు పరీక్షా పే చర్చా 2025 ఫార్మాట్ కూడా మారింది! మోదీతో పాటు అనేక మంది నిపుణులు ఇందులో పాల్గొన్నారు.
పరీక్షా పే చర్చాలో భాగంగా విద్యార్థులకు మోదీ పలు కీలక సూచనలు ఇచ్చారు. విద్యార్థులను పరిమితం చేయవద్దని, వారి అభిరుచిని వెలికితీసే స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరమని ఆయన అన్నారు. లీడర్షిప్ గురించి మాట్లాడుతూ.. నాయకుల ప్రవర్తనను ప్రజలు నేర్చుకుంటారని, అందుకే జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ చెప్పారు.
"మిమ్మల్ని మీరు ఎలా సవాలు చేసుకోవాలో తెలుసుకోవడానికి మీరు మీ మనస్సుపై ఫోకస్ చేయాలి. ఒక నాయకుడు తాను బోధించిన దానిని ఆచరించి, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నప్పుడే నాయకుడు అవుతాడు. గౌరవాన్ని డిమాండ్ చేయలేము.. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి- మీ ప్రవర్తన మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ప్రజలు మీ ప్రవర్తనను చూస్తారు. మీ ఉపదేశాలను కాదు," అని మోదీ అన్నారు.
“పరీక్షల భయంతో విద్యార్థులు బతకకూడదు. మనం రోబోలా బతకలేము. మనం మనుషులం," అని మోదీ చెప్పుకొచ్చారు.
“దురదృష్టవశాత్తూ 10వ తరగతి, 12వ తరగతిలో తగినన్ని మార్కులు రాకపోతే జీవితం నాశనమవుతుందని అంటున్నారు. అందుకే ఇంట్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మీకు ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని చాలా పనులు చేయమని అడుగుతారు. కానీ దాని గురించి చింతించకుండా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు సవాలు చేస్తూనే ఉండాలి. ఈ టెన్షన్‌ని మనసులోకి తీసుకోకుండా ఎప్పుడు, ఎంత చదవాలో నిర్ణయించుకోండి. ఇలా చేస్తే ఈ టెన్షన్ నుంచి బయటపడొచ్చు,” అని మోదీ అన్నారు.
ఈ నేపథ్యంలోనే మోదీ తన చిన్ననాటి జ్ఞాపకలను విద్యార్థులతో పంచుకున్నారు.
నేను స్కూల్లో ఉన్నప్పుడు నా టీచర్ నా హ్యాండ్రైటింగ్ని మార్చేందుకు చాలా ప్రయత్నించారు. కానీ అలా జరగలేదు,” అని మోదీ అన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని, విద్యార్థుల ప్రత్యేక ప్రతిభను కనుగొని ప్రోత్సహించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
మోదీతో సంభాషణపై విద్యార్థులు సానుకూలంగా స్పందించారు.
“పరీక్షల్లో ఒత్తిడి ఎలా తీసుకోకూడదో (ప్రధాని) మాకు అర్థమయ్యేలా చెప్పారు,” అని ఓ విద్యార్థు అన్నాడు.
పరీక్షా పే చర్చా..
MyGov పోర్టల్‌లో ప్రదర్శించిన డేటా ప్రకారం.. ఈ సంవత్సరం 3.30 కోట్లకు పైగా మంది విద్యార్థులు, 20.71 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు.
విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో.. బోర్డు పరీక్ష ప్రిపరేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, కెరీర్ సహా మరెన్నో కీలక అంశాల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం ఇస్తారు.
గతేడాది జనవరి 29న ఈ కార్యక్రమం జరిగింది. 205.62 లక్షల మంది విద్యార్థులు, 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మంది తల్లిదండ్రులు పీపీసీ 2024 కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
2018 నుంచి ప్రతియేటా మోదీ పరీక్షా పే చర్చా నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం