Delhi Pandav Nagar Murder: ముక్కలుగా నరికి వ్యక్తిని చంపిన భార్య, కొడుకు: పోలీసుల విచారణలో తెలిసిన వాస్తవాలు ఇవే
Delhi Pandav Nagar Murder: ఢిల్లీలో జరిగిన ఓ దారుణ హత్య గురించిన విషయాలను పోలీసులు వెల్లడించారు. అంజన్ దాస్ అనే వ్యక్తిని అతడి సవితి కొడుకు, భార్య హతమార్చగా.. ఈ ఘటన ఐదు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
Delhi Pandav Nagar Murder: దేశ రాజధాని ఢిల్లీలో మరో పాశవిక హత్య ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని అతడి భార్య, కొడుకు కలిసి చంపేశారు. ఆ తర్వాత అతడి శరీరాన్ని 10 ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచారు. శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేశారు. శ్రద్ధా వాకర్ హత్యను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ దురాగతంలోనూ విస్తుగొలిపే వాస్తవాలు ఉన్నాయి. ఢిల్లీలోని పాండవ్‍నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఐదు నెలల క్రితం జరిగిన ఈ హత్య విషయం.. సోమవారం వెలుగులోకి వచ్చింది. తాజాగా పోలీసులు ఈ విషయాన్ని గురించిన వివరాలు వెల్లడించారు.
10 ముక్కలుగా నరికి..
Delhi Pandav Nagar Murder: అంజన్ దాస్ అనే వ్యక్తిని అతడి భార్య, సవతి కొడుకు కలిసి ఈ ఏడాది మే నెలాఖరులో హత్య చేశారు. ఆ తర్వాత అతడి శరీరాన్ని 10 ముక్కలుగా నరికి, కొద్ది రోజుల పాటు ప్రిడ్జ్ లో ఉంచారు. ఆ శరీర భాగాలను కొన్ని ప్రాంతాల్లో పడేశారు. ఈ నేరాన్ని ఆ ఇద్దరూ పోలీసుల ముందు అంగీకరించారు. ఈ ఏడాది మే 30వ తేదీన అంజన్ దాస్‍కు అతడి భార్య, సవతి కొడుకు మద్యం తాగించారు. ఆ తర్వాత అతడి గొంతును కోశారు. అనంతరం రక్తమంతా కారిపోయేందుకు ఓ రోజు మొత్తం మృతదేహాన్ని అలానే ఉంచారు. ఆ తర్వాత 10 ముక్కలుగా కోశారు. ఇప్పటి వరకు ఆరు శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. గతంలోనే వీటిని స్వాధీనం చేసుకోగా.. ఇటీవల సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు ఈ హత్య ఉదంతం వెలుగుచూసింది.
“జూన్ 5న రామ్‍లీలా మైదానంలో కొన్ని శరీర భాగాలు దొరికాయి. ఆ తర్వాత మూడు రోజులు.. రెండు కాళ్లు, ఓ మోచేయి, పుర్రెను స్వాధీనం చేసుకున్నాం. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్నాం” అని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అమిత్ గోయెల్ చెప్పారు.
“అంజన్ దాస్ శరీర భాగాలను అతడి భార్య పూనమ్, కుమారుడు దీపక్ ఎవరూ లేని ప్రాంతాల్లో పడేశారు. రామ్‍లీలా మైదాన్, కొత్త అశోక్ నగర్ డ్రైన్ లాంటి ప్రాంతాల్లో విసిరేశారు. పుర్రెను పూడ్చిపెట్టారు” అని క్రైమ్ విభాగం స్పెషల్ సీపీ రవీందర్ యాదవ్ చెప్పారు.
హత్యకు కారణాలివే..
అంజన్ దాస్.. తన ఆభరణాలు అమ్మి బీహార్‍లో ఉన్న మొదటి భార్యకు డబ్బులు పంపాడని పూనమ్ ఆగ్రహించింది. అంజన్ సవతి కొడుకు దీపక్‍కు వివాహం అయ్యాక కుటుంబంలో గొడవలు మరింత తీవ్రం అయ్యాయి. దీంతో అది హత్య వరకు వెళ్లింది. అంజన్ దాస్‍ను.. పూనమ్, దీపక్ కలిపి చంపేశారు.
“దీపక్ వివాహం అయ్యాక అంజన్ కుటుంబంలో పరిస్థితులు మరింత క్షీణించాయి. దీపక్ భార్యపై, అతడి సోదరీమణుల్లో ఒకరిని అంజన్ యాదవ్ చెడు దృష్టితో చూసేవాడు. అలాగే అతడికి ఎలాంటి సంపాదన ఉండేది” అని సీపీ రవీందర్ చెప్పారు.
ఈ కారణాలతో రెండో భార్య అయిన పూనమ్, ఆమె కుమారుడు దీపక్.. ఇద్దరూ కలిసి అంజన్ దాస్‍ను చంపారని పోలీసులు వెల్లడించారు.
జూన్‍లో శరీర భాగాలు దొరికాక.. ఎవరిదోనని కనిపెట్టేందుకు తీవ్రంగా దర్యాప్తు చేసినట్టు కూడా డీసీపీ చెప్పారు.
పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్‍ను ఇటీవల పరిశీలించగా.. పూనమ్, దీపక్ ఆ ప్రాంతంలో పాలిథిన్ కవర్లను పట్టుకొని తరచూ తిరుగుతుండటం గుర్తించారు. దీంతో వారిని విచారించటంతో ఈ హత్య విషయం బయటికి వచ్చింది.