ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ స్థాయికి ప్రమోట్ చేసే ప్రతిపాదనకు పాక్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపిందని మంగళవారం ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో అత్యున్నత పదవి ఫీల్డ్ మార్షల్.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఆ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మూడు రోజుల పాటు దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఆ తరువాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఆ తరువాత కొద్ది రోజులకే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ స్థాయికి ప్రమోట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. భారత్ పై దాడుల్లో ఆసిఫ్ మునీర్ ప్రశంసనీయ పాత్ర పోషించినందుకు ఆయనకు పదోన్నతి లభించిందని ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ పీటీవీ పేర్కొంది.
2019 ఫిబ్రవరిలో పుల్వామా ఆత్మాహుతి దాడితో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు మునీర్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు నేతృత్వం వహించారు. అసిమ్ మునీర్ 2022 నుంచి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. ఆయన 11వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2024 నవంబర్ లో ఆర్మీ చీఫ్ గా ఆయన పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగించారు.
సంబంధిత కథనం