Crime news : చికిత్సకు డబ్బులు లేక, 15 రోజుల పసికందును సజీవంగా సమాధి చేసిన తండ్రి!
Crime news : ఓ వ్యక్తి, తన 15 రోజుల ఆడబిడ్డను సజీవంగా సమాధి చేశాడు. పోలీసులు అడగ్గా.. నేరానికి గల కారణాన్ని వివరించాడు.
పాకిస్థాన్లో అత్యంత విషాదరక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి, తన 15 రోజుల కూతురిని సజీవంగా సమాధి చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని నౌషహ్రో ఫిరోజ్లో ఈ ఘటన జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం.. నిందితుడు పేరు తయ్యబ్. అతనికి కొన్ని రోజుల క్రితం ఒక ఆడబిడ్డ పుట్టింది. కానీ ఆమెకు చికిత్స చేయించేందుకు అతని వద్ద డబ్బులు లేవు. ఫలితంగా ఆమెను వదిలించుకోవాలని చూశాడు.
ఈ నేపథ్యంలో 15 రోజుల పసికందును ఒక గోనె సంచిలో పెట్టి, అనంతరం భూమిని తవ్వి, సజీవంగా ఉన్నప్పుడే సమాధి చేశాడు.
పసికందు కనిపించడం లేదన్న విషయం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తయ్యబ్పై అనుమానంతో అతడిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను అసలు విషయం చెప్పాడు. చికిత్సకు డబ్బులు లేక, తన 15 రోజుల పసికందును సజీవంగా సమాధి చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు వేశారు.
కోర్టు ఆదేశాలతో ఘటనాస్థలంలో తవ్వకాలు చేపట్టి, పసికందు మృతదేహాన్ని వెలికి తీస్తామని, అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మరిన్ని వివరాలు సేకరిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, దేశంలో పేదల పరిస్థితికి ఈ ఘటన అద్ధం పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:- Haryana bus accident : బోల్తాపడిన బస్సు.. 40మంది విద్యార్థులకు గాయాలు!
పని మనిషిపై చిత్రహింసలు..
పాకిస్థాన్లో నేరాలకు సంబంధించి నిత్యం ఆందోళనకర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ 13ఏళ్ల బాలికకు భార్యాభర్తలు నరకం చూపించిన ఘటన లాహోర్లోని డిఫెన్స్ బీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు, నిందితుల వద్ద పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెను వారు నిత్యం వేధించేవారు. బట్టలు తీసేసేవారు. భౌతికంగా చిత్రహింసలకు గురిచేసేవారు. దారుణంగా తిట్టేవారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితుడు హస్సమ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతని భార్యను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
"బాలికను భౌతికంగా హింసించారు. బట్టులు ఊడతీశారు. ఇంట్లో దొంగతనానికి పాల్పడిందేమో అన్న అనుమానంతో ఆమెను చత్రహింసలకు గురిచేశారు. బాలికకు చెయ్యి విరిగిందని తండ్రి చెప్పాడు. ముక్కు కూడా దెబ్బతింజి," అని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీనిచ్చారు.
సంబంధిత కథనం