చైనా తన ఆయుధాలను పాక్ ద్వారా పరీక్షించుకుంటోందని, పాక్ చైనాకు ఒక లైవ్ ల్యాబ్ గా మారిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ శుక్రవారం అన్నారు, సరిహద్దు వెంబడి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లకు వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు ప్రధాన మద్దతుదారుగా చైనా నిలిచిందన్నారు.
పాకిస్తాన్ సైనిక సామగ్రిలో, ఆయుధాల్లో 81 శాతం చైనీయులవేనని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. భారత్, పాక్ ఘర్షణను చైనా తన ఆయుధాల పరీక్షా కేంద్రం మార్చుకుందన్నారు. "చైనా తన ఆయుధాలను అక్కడ ఉన్న వివిధ ఇతర ఆయుధ వ్యవస్థలకు వ్యతిరేకంగా పరీక్షించగలిగింది. పాకిస్తాన్ చైనాకు అందుబాటులో ఉన్న లైవ్ ల్యాబ్ లాంటిది’’ అన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ సింగ్ మాట్లాడారు.
"ఒక సరిహద్దు, ఇద్దరు శత్రువులు.. వాస్తవానికి ముగ్గురు శత్రువులు’’ అని లెఫ్టినెంట్ జనరల్ సింగ్ వ్యాఖ్యానించారు. పాక్, చైనాలతో పాటు మూడో శత్రువుగా టర్కీ నిలిచిందన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ కు డ్రోన్లను అందించి టర్కీ మనకు మరో శత్రువుగా మారిందన్నారు. భారత్ తో నేరుగా కంటే పాకిస్థాన్ ను వాడుకుని ఇబ్బంది పెట్టడానికే చైనా మొగ్గుచూపుతోందని ఆయన అన్నారు.
ఘర్షణ సమయంలో భారత్ కదలికలపై పాకిస్థాన్ కు రియల్ టైమ్ సమాచారం ఉందని ఆయన అన్నారు. దాని గురించి డీజీఎంవో స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ ప్రస్తావించిందని తెలిపారు. అవి చైనా నుంచి పాక్ కు అందుతున్న లైవ్ ఇన్ పుట్స్ అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతి చెందిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. భారత్ లోని పంజాబ్, జమ్ముకశ్మీర్, ఇతర రాష్ట్రాల్లో చైనా, టర్కీ అందించినట్లు భావిస్తున్న వరుస క్షిపణి, డ్రోన్ దాడులతో పాక్ ఎదురుదాడికి దిగింది. చాలా దాడులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
సంబంధిత కథనం