ాకిస్థాన్‌కు టర్కీ మద్దతివ్వడాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. పాకిస్థాన్‌కు మద్దతిచ్చే వైఖరిని టర్కీ పునఃపరిశీలించాలని చెప్పారు. భారత్‌తో టర్కీకి చారిత్రక సంబంధాలు ఉన్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవడం, కమ్యూనిటీలను విడదీయడం పాకిస్థాన్ చేస్తున్న పనులు అని మండిపడ్డారు.
భారత్‌తో ఘర్షణలో తనను తాను ఇస్లామిక్ దేశంగా చూపించుకోవడంపై పాకిస్థాన్‌ను నిలదీయాల్సిన అవసరం ఉందని ఓవైసీ అన్నారు. 'భారత్ కథను మనం ముందుకు తీసుకెళ్లాలి. పాకిస్థాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ భారతదేశంలో కూడా దాదాపు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది.' అని ఓవైసీ చెప్పారు. పాకిస్తాన్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు కాదని, మన ప్రధాని కాల్పుల విరమణ ప్రకటించాల్సిందని ఓవైసీ అన్నారు. అమెరికాతో పాకిస్తాన్ వాణిజ్యం కేవలం 10 బిలియన్లు మాత్రమే, భారతదేశం వాణిజ్యం 150 బిలియన్లకు పైగా ఉందన్నారు. పాకిస్థాన్ ఇకపై మనపై ఉగ్రదాడులు చేయదని అమెరికా హామీ ఇవ్వగలదా? అని ప్రశ్నించారు. భారతదేశాన్ని అస్థిరపరచడం, మత విభేదాలను రెచ్చగొట్టడం, దేశ ఆర్థిక వృద్ధిని అడ్డుకోవడం పాకిస్థాన్ భావజాలంలో భాగమని ఓవైసీ విమర్శించారు. ఉగ్రవాదులకు ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం చేస్తూ పాకిస్థాన్ మానవాళికి ముప్పుగా మారిందన్నారు.
పాక్ ఉగ్రవాద కార్యకలాపాల గురించి ప్రపంచం ముందుకు తీసుకెళ్లే అఖిలపక్ష బృందంలో ఓవైసీ కూడా ఉన్నారు. దీనిపై కూడా ఆయన మాట్లాడారు. 'పహల్గామ్‌లో దురదృష్టకరమైన సంఘటన తరువాత మన ప్రభుత్వం.. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రోద్బలంతో మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద ఘటనల దృష్ట్యా ఇతర దేశాల ముందు నిలవడం చాలా ముఖ్యం. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. మేం ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఈ బాధ్యతను నెరవేర్చడానికి నా వంతు కృషి చేస్తాను.' అని ఓవైసీ అన్నారు.
కేవలం తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికే ప్రజలు తమను ఎన్నుకోలేదన్నారు. దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలంతా ఐక్యంగా ఉన్నారన్నారని చెప్పారు. తన బృందంతో యూకే, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ దేశాలకు వెళ్లబోతున్నట్టుగా ఓవైసీ వెల్లడించారు.