Jail term to Imran Khan: చట్టవిరుద్ధ వివాహం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఏడేళ్ల జైలు శిక్ష
Jail term to Imran Khan: ఇస్లామాబాద్: పాక్ కోర్టులు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుసగా జైలు శిక్షలు విధిస్తున్నాయి. తాజాగా, చట్ట విరుద్ధంగా వివాహం చేసుకున్న నేరానికి గానూ ఇమ్రాన్ ఖాన్ కు, అతడి భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా ఖాన్ కు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. జైలుశిక్షతో పాటు వీరిద్దరికీ చెరో రూ.5,00,000 (1,800 డాలర్లు) జరిమానా విధించి ఈ వారంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా వచ్చిన మూడవ తీర్పు ఇది. ఈ జైలు శిక్షల కారణంగా ఇమ్రాన్ ఖాన్ జాతీయ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.
గత వారం 10 సంవత్సరాల జైలు శిక్ష
ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కు ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసినందుకు 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. అలాగే, ప్రభుత్వంలో ఉండగా వచ్చిన బహుమతులను అక్రమంగా అమ్మినందుకు కూడా ఆయన 3 సంవత్సరాల జైలు శిక్షకు గురయ్యారు. తాజాగా, శనివారం, చట్ట విరుద్ధ వివాహం నేరానికి గానూ ఏడేళ్ల జైలు శిక్ష పడింది. తన మునుపటి భర్తకు విడాకులు ఇచ్చి ఇమ్రాన్ ఖాన్ ను వివాహం చేసుకునే ముందు "ఇద్దత్" అనే ఇస్లాం నిర్దేశించిన వెయిటింగ్ పీరియడ్ ను పూర్తి చేయలేదని బుష్రాపై ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ తొలిసారి ప్రధాని కావడానికి ఏడు నెలల ముందు 2018 జనవరిలో రహస్య వేడుకలో వారిరువురు రహస్యంగా వివాహం చేసుకున్నారు.
కక్ష సాధింపు చర్య
ఈ జైలు శిక్ష కక్ష సాధింపు చర్య అని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ విమర్శించింది. హడావుడిగా, ఎలాంటి నిబంధనలు పాటించకుండా విచారణ జరిపారని ఆరోపించింది. కనీసం సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదని, ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ లో ఫిబ్రవరి 8న జాతీయ ఎన్నికలు జరగనున్నాయి.
రావల్పిండి జైలులో..
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని జైలులో ఉండగా, ఆయన భార్య రావల్పిండిలోని జైలులో ఉండగా, ఆయన భార్య బుష్రా ఖాన్ ను ఇస్లామాబాద్ లోని కొండపై ఉన్న భవనంలో శిక్షను అనుభవించేందుకు అనుమతించారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగకుండా అనర్హత వేటును ఎదుర్కొంటున్నారు. 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ తరచూ బుష్రాను తన ఆధ్యాత్మిక గురువుగా అభివర్ణిస్తుంటారు. ఆమె ఇస్లాం లోని మార్మిక రూపమైన సూఫీయిజం ను అభిమానిస్తారు. ఆమె అసలు పేరు బుష్రా రియాజ్ వాటో కాగా, ఇమ్రాన్ ఖాన్ తో వివాహానంతరం తన పేరును బుష్రా ఖాన్ గా మార్చుకున్నారు. వ్యాపార దిగ్గజం జేమ్స్ గోల్డ్ స్మిత్ కుమార్తె జెమీమా గోల్డ్ స్మిత్, టెలివిజన్ జర్నలిస్ట్ రెహమ్ నయ్యర్ ఖాన్ లతో ఇమ్రాన్ ఖాన్ కు జరిగిన గత రెండు వివాహాలు విడాకులతో ముగిశాయి.